స్వాతంత్య్ర భారతావని  చరిత్రలోనే  ప్రధాని మోడీ రికార్ట్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. అది అలాంటి ఇలాంటి రికార్డ్ కాదు.. జనాల మైండ్ బ్లాంక్ అయ్యే రికార్డ్.. కర్రు కాచి వాత పెట్టేందుకు సిద్ధమయ్యారు. అదేంటో తెలుసా.. పెట్రోల్ వాత.. అవును భారత దేశ చరిత్రలోనే తొలిసారి పెట్రోల్ లీటర్ ధర రూ.90కి చేరువవుతోంది. దీనికి అధికార బీజేపీ పండుగ చేసుకుంటోంది. ప్రజలు మాత్రం నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ముడి చమురు ధరలు మోస్తారుగా ఉన్న ఖజానా నింపుకునేందుకు పట్టపగ్గాలేక్కుండా బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ రేటు పెంచుకుంటూ పోతోంది. పెట్రోల్ భారంతో నిత్యావసరాలు ఆకాశాన్నంటి సామాన్యుడు విలవిల్లాడుతున్నారు. ఇంత మంది బాధపడుతున్నా కానీ బీజేపీ ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డ చందంగా  ఉండిపోవడం దేశ ప్రజలను నివ్వెరపరుస్తోంది.

బీజేపీ అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలు రూ.50కి తగ్గిస్తానని మోడీ అన్నట్టు సోషల్ మీడియాలో బీజేపీ అభిమానులు తెగ షేర్లు చేస్తున్నారు. ఇప్పుడు 90 రూపాయలకు చేరువైన వేళ కషాయ అనుకూలురు ఏం సమాధానం చెప్తారని సామాన్యులు నిలదీస్తున్నారు. పెట్రో ఉత్పత్తులపై ప్రజలను బాదుతూ .. భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్న కేంద్రం తీరు చూసి అంతా రగిలిపోతున్నారు.  ప్రతి ఒక్కరి మీదా ఆ భారం గుదిబండగా మారుతున్నా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తోందంటున్నారు..

పెట్రో ధరలు శనివారం రికార్డుస్థాయికి పెరిగిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో 35 పైసలు పెరిగి రూ.81.63కు చేరింది. ఇక పన్నుపోటు  ఎక్కువగా ఉండే మహారాష్ట్రలో పెట్రోల్ ధర ఆకాశాన్నంటింది.  తాజా పెంపుతో పెట్రోల్ లీటర్ కు ముంబైలో రూ.89.01కు చేరింది.మరో 99 పైసలు కనుక ఈ రెండు మూడు రోజుల్లో పెరిగితే దేశంలోనే ఇదే ఆల్ టైం రికార్డ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాద్ లో పెట్రోల్ లీటర్ రూ. 86.18 అదే విజయవాడలో పెట్రోల్ రూ. 85.41 చేరువైంది.

ఇక పెట్రోల్ తోవలోనే డీజిల్ కూడా పెరుగుతోంది. నిత్యావసరాల ధరల పెరుగుదలకు డీజిల్ రేటు కారణమవుతోంది. ముంబైలో ప్రస్తుతం లీటర్ డీజిల్  రూ.78.07కు చేరుకుంది. ఇలా భారీగా పెంచుకుంటూ పోతూ దేశచరిత్రలోనే అత్యధిక పెట్రోల్ ధరలు పెంచిన ప్రధానిగా నరేంద్రమోడీ చరిత్రలో నిలిచిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నమ్మి ఓట్లేసిన జనాలకు పెట్రో ధరల పెంపుతో మోడీ మంచి బహుమతి ఇచ్చాడని సామాన్యులు ఆక్రోషం వెల్లగక్కుతున్నారు.