ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రమాదంగా కొండగట్టు బస్సు ప్రమాదం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటి దాకా 57 మంది మృత్యువాత పడడం కలచివేస్తోంది. చికిత్స పొందుతోన్న క్షతగాత్రులలో కూడా కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దేశచరిత్రలోని ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఒకటిగా ఈ ప్రమాదం నిలిచిపోయింది. జాతీయ – అంతర్జాతీయ మీడియా కూడా ఈ ఘటనపై కథనాలు వెలువరించింది. సాధారణంగా రైలు ప్రమాదాలు జరిగినపుడు మాత్రమే మృతుల సంఖ్య ఈ స్థాయిలో ఉంటుందని – ఓ బస్సు లోయలో పడ్డ ఘటనలో ఇంత మంది చనిపోవడం అసాధారణమని జాతీయ మీడియా కూడా అభిప్రాయపడింది. అయితే అసలు కొండగట్టు ప్రమాదం జరగడానికి కారణాలేమిటి? మానవతప్పిదమా…అధికారుల నిర్లక్ష్యమా…ప్రభుత్వం అలసత్వమా…?అన్నదానిపై ఇపుడు చర్చలు జరుగుతున్నాయి. ఆ ఘోర ప్రమాదానికి గల కారణాలను నిపుణులు విశ్లేషిస్తున్నారు. తిలాపాపం తలా పిడికెడు అన్నట్లు ఈ ఘోర ప్రమాదానికి అనేక కారణాలున్నాయని చెబుతున్నారు.

వాస్తవానికి కొద్ది రోజుల క్రితం ఇదే కొండగట్టు రోడ్డుపై లారీ ప్రమాదం జరిగి 20మంది మృతిచెందారు. ఈ దుర్ఘటన తర్వాత ఈ ఘాట్ రోడ్డుపైకి భారీ వాహనాలను ఆర్టీవో అధికారులు నిషేధించారు. కేవలం – బైక్ లను మాత్రమే అనుమతిస్తూ బోర్డులు కూడా పెట్టారు. అయితే ఏమైందో ఏమో తెలియదుగానీ….గత 3నెలల నుంచి ఈ రోడ్డులో మళ్లీ బస్సులు – భారీ వాహనాలను అనుమతినిస్తున్నారు. ఈ ఘాట్ రోడ్డు నుంచి హైవే చేరుకోవడానికి కేవలం కిలోమీటర్ దూరమే ఉండడంతో చాలామంది దీనినే ఆశ్రయిస్తున్నారు. అదే ఘాట్ రోడ్డు నుంచి వేరే రోడ్డు ద్వారా హైవేకు చేరుకోవాలంటే 5 కిలోమీటర్లు వెళ్లాలి. కాబట్టి అందరూ ఈ ప్రమాదకరమైన రోడ్డునే ఎంచుకుంటున్నారు. ఇక 40 సామర్థ్యం ఉన్న ఆర్టీసీ ఆర్డినరీ బస్సులో 88మంది ప్రయాణించడం….ఓవర్ లోడ్ అయినప్పటికీ ఆక్యుపెన్స్సీ కోసం కక్కుర్తి పడి ఎక్కువమందిని ఎక్కించుకోవడం వల్ల మృతుల సంఖ్య భారీగా ఉంది.

మితిమీరిన వేగంతో బస్సు నడపడం …స్పీడ్ బ్రేకర్ సమీపించే సమయంలో గేర్లను న్యూట్రల్ చేయడం కూడా ప్రమాదానికి ఒక కారణం. స్పీడ్ బ్రేకర్ దగ్గర బస్సు అదుపు చేసే క్రమంలో బ్రేక్ వేయడంతో….బస్సు ఓ పక్కకు ఒరిగిపోయింది. దీంతో ప్రయాణికులంతా ఒకరిపై ఒకరు పడ్డారు. ఈ క్రమంలోనే డ్రైవర్ పై కూడా ప్రయాణికులు పడడంతో అతడు స్టీరింగ్ పై పట్టు కోల్పోయాడు. ఏంజరుగుతుందో తెలుసుకునే లోపే…రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది. ఇంత ప్రమాదం జరిగినప్పటికీ….బస్సు ఆక్యుపెన్సీ ప్రకారం 40-50 మంది ప్రయాణికులుంటే మృతుల సంఖ్య తగ్గి ఉండేదది. ఆ ప్రమాదధాటికి బస్సు సీట్లన్నీ ఒకదానిపైకి ఒకటి తోసుకువచ్చాయి. వాటి భాగాలు గుచ్చుకొని కొందరు….ఒకరిపై ఒకరు పడి ఊపిరి ఆడక కొందరు మరణించారు.

88 మంది ప్రయాణికులున్న ఆ బస్సు …ప్యాక్ చేసినట్లు అవ్వడం వల్ల వారంతా క్రష్ అయ్యారు. ఆ రోడ్డు ప్రమాదరమని తెలిసినా….కండక్టర్ చెబుతున్నా వినకుండా….బస్సును ఆ రోడ్డులో తీసుకువెళ్లడం…డ్రైవర్ చేసిన పొరపాటు. అసలు ఆ రోడ్డులో బస్సులు లారీలపై విధించిన నిషేధం ఎత్తేయడం ఆర్టీసీ అధికారులు చేసిన తప్పు. ఇంధనం ఆదా పేరుతో తక్కువ సర్వీసులు నడపడంతో…ఉన్న అరకొరా సర్వీసులతోనే ప్రజలు ఇక్కట్లు పడుతూ….40 మంది ఉండాల్సిన బస్సులో 80మంది ప్రయాణించి మృత్యువాత పడ్డారు. ఈ ఘోర ప్రమాదానికి ఆర్టీసీ నిర్లక్ష్యం…కాసుల కక్కుర్తి…ఆక్యుపెన్సీ ఆరాటం…వంటివి కారణాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇకపైన ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఇటు ఆర్టీసీపైనా…అటు ప్రభుత్వం పైనా ఉంది.