విశాఖలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సిటీలోని గాజువాకలో విద్యుద్ఘాతంతో రెండు సినిమా థియేటర్లు దగ్థమయ్యాయి. గాజువాక మొయిన్ రోడ్లో ఉన్న డబుల్ థియేటర్లు కన్య.. శ్రీకన్య థియేటర్లు విశాఖ వాసులతో పాటు చుట్టుపక్కల వారికి సైతం సుపరిచితం.

ఎన్నో ఏళ్లుగా తెలిసిన ఈ రెండు థియేటర్లలో ఈ రోజు (సోమవారం) ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.  తెల్లవారుజామున థియేటర్లలో నుంచి పొగరావటాన్ని గుర్తించిన థియేటర్ స్వీపర్.. యజమానికి సమాచారాన్ని అందించారు. వెంటనే వారు అగ్నిమాపక శాఖ దృష్టికి తీసుకెళ్లారు.

ఫైరింజన్లు థియేటర్ల వద్దకు వచ్చేసరికి మంటలు పెరిగి పెద్దవయ్యాయి. మంటల్ని అదుపులోకి తీసుకురావటానికి 8 ఫైరింజన్లను వినియోగించారు. అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున ప్రయత్నం చేసిన తర్వాత మంటల్ని అదుపులోకి తెచ్చారు. అప్పటికే థియేటర్లు పూర్తిగా తగలబడ్డాయి.

మొత్తం ఆస్తి నష్టం రూ.3 కోట్ల వరకూ ఉందని అంచనా వేస్తున్నారు. థియేటర్లలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణకు పోలీసులు అధికారులు విచారణకు ఆదేశించారు. విద్యుద్ఘాతంతోనే ప్రమాదం సంభవించినట్లుగా థియేటర్ యజమాని చెబుతున్నారు.