దేశంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్న అనేక సంఘటనల్లో తాజా పరిణామం ఇది. పన్నెండో తరగతి బోర్డు పరీక్షల్లో టాపర్ అయిన సరస్వతి పుత్రికపై సామూహిక లైంగికదాడి చేశారు. హర్యానాలోని మహేందర్ గఢ్ జిల్లాలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దుండగులు విద్యార్థినికి (19) మత్తుమందు కలిపిన నీళ్లను బలవంతంగా తాగించి స్పృహ కోల్పోయాక ఈ అఘాయిత్యం చేశారు. బుధవారం కోచింగ్ కు వెళ్లిన తన కుమార్తెను దుండగులు అపహరించి లైంగికదాడి చేశారని విద్యార్థిని తల్లి చెప్పారు. నిందితులపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని ఇప్పటికీ వారిని అరెస్టు చేయలేదన్నారు. బేటి పడావో-బేటీ బచావో అని ప్రభుత్వం చెబుతున్నదని కానీ ఆడ పిల్లలను చదువించుకుంటే ఇ లాంటి మూల్యం చెల్లించుకోవాలా? అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.  ముగ్గురు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు.

బాధితురాలు మాట్లాడుతూ కోచింగ్ కు వెళ్తున్న తనను ముగ్గురు వ్యక్తులు అడ్డుకున్నారని – మత్తుమందు కలిపిన నీళ్లను బలవంతంగా తాగించారని చెప్పారు. స్పృహ కోల్పోయిన తనను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక లైంగికదాడికి పాల్పడిన తర్వాత అక్కడి నుంచి పారిపోయారన్నారు. కనినాలోని బస్ స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థినిని ముగ్గురు దుండగులు అపహరించారని అనంతరం లైంగికదాడికి పాల్పడ్డారని పోలీసులు చెప్పారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. బాధితురాలు – నిందితులు ఒకే గ్రామం వారని తెలిపారు.