ప్రణయ్ హంతకుడి అరెస్టు!

ప్రణయ్ హంతకుడి అరెస్టు!

మిర్యాలగూడలో సంచలనం రేపిన ప్రణయ్ హత్యోదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. పట్టపగలు నడిరోడ్డుపై ప్రణయ్ ను అత్యంత కిరాతకంగా ఓ కిరాయి హంతకుడు నరికి చంపిన వైనం ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రణయ్ ను చంపాలన్న కసితోనే ఆ హంతకుడు…పాశవికంగా అతడిపై దాడి చేశాడు. సీసీటీవీ ఫుటేజిలో నిందితుడి ఆచూకి లభించడంతో అతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. బీహార్ కు చెందిన ఓ వ్యక్తి ఈ హత్యకు పాల్పడినట్లు ఆ తరువాత పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా నేడు బిహార్ లో తలదాచుకున్న కసాయి కిరాయి హంతకుడు సుభాష్ శర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిహార్ కు చెందిన శర్మను స్థానిక కోర్టులో హాజరుపరిచిన తర్వాత నల్గొండకు తరలించనున్నారు. ఈ రోజు సాయంత్రం అతడిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశముంది.

ప్రణయ్ హత్యకు సంబంధించి ఏడుగురు నిందితులు ఉన్నారని నల్గొండ ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు. ప్రణయ్ ను హత్య చేసింది బీహార్ కు చెందిన శర్మ అని ఆయన వెల్లడించారు. శర్మను బిహార్ నుంచి హైదరాబాదుకు తరలించి ఆపై నల్గొండకు తరలిస్తామన్నారు. ఈ హత్యకు రూ.1 కోటి డీల్ కుదిరిందని – రూ.18 లక్షలు ముందుగా చెల్లించారని తెలిపారు. కులాంతర వివాహం – కూతురిపై అతి ప్రేమ – ఆమె తనకు దక్కాలనే ఆశతోనే మారుతిరావు ప్రణయ్ పైన కక్ష పెంచుకున్నారని ఎస్పీ తెలిపారు. అయితే నయీం గ్యాంగుకు ప్రణయ్ హత్యతో సంబంధం లేదని ఎస్పీ తెలిపారు. గతంలో అమృత మామయ్యను వేముల వీరేశం బెదిరించినట్లు కేసు నమోదైందని – దాని ప్రకారం అమృత …వీరేశం పేరు చెప్పి ఉంటుందని అన్నారు. అయితే ఈ మూడు రోజుల విచారణలో ఈ హత్యకు సంబంధించి వీరేశం పాత్ర లేదని తెలిసిందని చెప్పారు. ఇప్పటివరకు అమృత స్టేట్ మెంట్ రికార్డు చేయలేదని – ఒకవేళ ఆమె వీరేశంపై లిఖితపూర్వక ఫిర్యాదు ఇస్తే విచారణ చేస్తామని అన్నారు. ఈ కేసును మూడు రోజుల్లోనే ఛేదించామని – ఈ హత్య తెర వెనుక చాలామంది ఉన్నారని అన్నారు.

విశాఖ సిటీలో డబుల్ థియేటర్ దగ్థం

విశాఖ సిటీలో డబుల్ థియేటర్ దగ్థం

విశాఖలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. సిటీలోని గాజువాకలో విద్యుద్ఘాతంతో రెండు సినిమా థియేటర్లు దగ్థమయ్యాయి. గాజువాక మొయిన్ రోడ్లో ఉన్న డబుల్ థియేటర్లు కన్య.. శ్రీకన్య థియేటర్లు విశాఖ వాసులతో పాటు చుట్టుపక్కల వారికి సైతం సుపరిచితం.

ఎన్నో ఏళ్లుగా తెలిసిన ఈ రెండు థియేటర్లలో ఈ రోజు (సోమవారం) ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.  తెల్లవారుజామున థియేటర్లలో నుంచి పొగరావటాన్ని గుర్తించిన థియేటర్ స్వీపర్.. యజమానికి సమాచారాన్ని అందించారు. వెంటనే వారు అగ్నిమాపక శాఖ దృష్టికి తీసుకెళ్లారు.

ఫైరింజన్లు థియేటర్ల వద్దకు వచ్చేసరికి మంటలు పెరిగి పెద్దవయ్యాయి. మంటల్ని అదుపులోకి తీసుకురావటానికి 8 ఫైరింజన్లను వినియోగించారు. అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున ప్రయత్నం చేసిన తర్వాత మంటల్ని అదుపులోకి తెచ్చారు. అప్పటికే థియేటర్లు పూర్తిగా తగలబడ్డాయి.

మొత్తం ఆస్తి నష్టం రూ.3 కోట్ల వరకూ ఉందని అంచనా వేస్తున్నారు. థియేటర్లలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై సమగ్ర విచారణకు పోలీసులు అధికారులు విచారణకు ఆదేశించారు. విద్యుద్ఘాతంతోనే ప్రమాదం సంభవించినట్లుగా థియేటర్ యజమాని చెబుతున్నారు.

సమంత ఎంపీ కవిత ?

సమంత ఎంపీ కవిత ?

హీరోయిన్ సమంత ముఖ్యపాత్రలో నటించిన ‘యూటర్న్’ మూవీ ఇటీవలే విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.. ఈ మెసేజ్ థ్రిల్లర్ మూవీకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.  పవన్ కుమార్ దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి రాంబాబు బండారు ఈ సినిమాను నిర్మించారు. తాజాగా మూవీ సక్సెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేసీఆర్ కుమార్తె ఎంపీ కవిత హాజరై సమంత గురించి పలు షాకింగ్ విషయాలు వెల్లడించారు.

ఎంపీ కవిత మాట్లాడుతూ.. ‘‘యూటర్న్ మూవీ అద్భుతమైన సినిమా. ఈ సినిమా ద్వారా సమాజానికి ఇచ్చిన మెసేజ్ వెలకట్టలేనిది. ఈ సినిమా చూశాక ప్రజల్లో మార్పు వచ్చింది. ఎవరూ యూటర్న్ తీసుకోవడానికి భయపడిపోతున్నారు. మా పిల్లలు ఈ సినిమా చూసి సినిమా బాగుందంటూ మంచి రివ్యూ ఇచ్చారు. ఆధునిక మహిళకు సమంత గొప్ప ఉదాహరణ అనడంలో ఎలాంటి సందేహం లేదు.  రంగస్థలంలోని సమంతకు.. యూటర్న్ లోని సమంతకు అస్సలు పోలికే లేదు.. సమంత నటియే కాదు.. గొప్ప మానవతా వాది. తన ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సేవ చేస్తున్నారు. అలాగే తెలంగాణ హ్యాండ్లూమ్స్ కు సమంత బ్రాండ్ అంబాసిడర్ గా తెలంగాణ చేనేతకు గుర్తింపు తెచ్చారు. ’ అంటూ సమంతను ఆకాశానికెత్తేశారు.

ఇక చైతన్య-సమంత జోడీ గురించి కూడా కవిత తనదైన శైలిలో మాట్లాడి జోష్ నింపారు. ప్రస్తుతం సమంత – చైతన్య నటించిన సినిమాలు ఒకేసారి రిలీజ్ అయ్యాయని.. ఈ రెండు సినిమాలు బాగా నడుస్తున్నాయని కవిత మెచ్చుకున్నారు. కాబట్టి వీరిద్దరి మధ్య ఇంటా  – బయటా కూడా ఆరోగ్యకర పోటీ ఉంటుందని భావిస్తున్నా’ అంటూ సమంతకు నవ్వుతూ సెటైర్ వేశారు.

జనాల మైండ్ బ్లాంక్ అయ్యే రికార్డ్.

జనాల మైండ్ బ్లాంక్ అయ్యే రికార్డ్.

స్వాతంత్య్ర భారతావని  చరిత్రలోనే  ప్రధాని మోడీ రికార్ట్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. అది అలాంటి ఇలాంటి రికార్డ్ కాదు.. జనాల మైండ్ బ్లాంక్ అయ్యే రికార్డ్.. కర్రు కాచి వాత పెట్టేందుకు సిద్ధమయ్యారు. అదేంటో తెలుసా.. పెట్రోల్ వాత.. అవును భారత దేశ చరిత్రలోనే తొలిసారి పెట్రోల్ లీటర్ ధర రూ.90కి చేరువవుతోంది. దీనికి అధికార బీజేపీ పండుగ చేసుకుంటోంది. ప్రజలు మాత్రం నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ముడి చమురు ధరలు మోస్తారుగా ఉన్న ఖజానా నింపుకునేందుకు పట్టపగ్గాలేక్కుండా బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ రేటు పెంచుకుంటూ పోతోంది. పెట్రోల్ భారంతో నిత్యావసరాలు ఆకాశాన్నంటి సామాన్యుడు విలవిల్లాడుతున్నారు. ఇంత మంది బాధపడుతున్నా కానీ బీజేపీ ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డ చందంగా  ఉండిపోవడం దేశ ప్రజలను నివ్వెరపరుస్తోంది.

బీజేపీ అధికారంలోకి వస్తే పెట్రోల్ ధరలు రూ.50కి తగ్గిస్తానని మోడీ అన్నట్టు సోషల్ మీడియాలో బీజేపీ అభిమానులు తెగ షేర్లు చేస్తున్నారు. ఇప్పుడు 90 రూపాయలకు చేరువైన వేళ కషాయ అనుకూలురు ఏం సమాధానం చెప్తారని సామాన్యులు నిలదీస్తున్నారు. పెట్రో ఉత్పత్తులపై ప్రజలను బాదుతూ .. భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్న కేంద్రం తీరు చూసి అంతా రగిలిపోతున్నారు.  ప్రతి ఒక్కరి మీదా ఆ భారం గుదిబండగా మారుతున్నా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తోందంటున్నారు..

పెట్రో ధరలు శనివారం రికార్డుస్థాయికి పెరిగిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో 35 పైసలు పెరిగి రూ.81.63కు చేరింది. ఇక పన్నుపోటు  ఎక్కువగా ఉండే మహారాష్ట్రలో పెట్రోల్ ధర ఆకాశాన్నంటింది.  తాజా పెంపుతో పెట్రోల్ లీటర్ కు ముంబైలో రూ.89.01కు చేరింది.మరో 99 పైసలు కనుక ఈ రెండు మూడు రోజుల్లో పెరిగితే దేశంలోనే ఇదే ఆల్ టైం రికార్డ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాద్ లో పెట్రోల్ లీటర్ రూ. 86.18 అదే విజయవాడలో పెట్రోల్ రూ. 85.41 చేరువైంది.

ఇక పెట్రోల్ తోవలోనే డీజిల్ కూడా పెరుగుతోంది. నిత్యావసరాల ధరల పెరుగుదలకు డీజిల్ రేటు కారణమవుతోంది. ముంబైలో ప్రస్తుతం లీటర్ డీజిల్  రూ.78.07కు చేరుకుంది. ఇలా భారీగా పెంచుకుంటూ పోతూ దేశచరిత్రలోనే అత్యధిక పెట్రోల్ ధరలు పెంచిన ప్రధానిగా నరేంద్రమోడీ చరిత్రలో నిలిచిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నమ్మి ఓట్లేసిన జనాలకు పెట్రో ధరల పెంపుతో మోడీ మంచి బహుమతి ఇచ్చాడని సామాన్యులు ఆక్రోషం వెల్లగక్కుతున్నారు.

అమృత..నాన్నే చంపేశాడు

అమృత..నాన్నే చంపేశాడు

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకున్న పరువు హత్య గురించి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి కన్నతండ్రే తన భర్తను కిరాతకంగా చంపించిన వైనంతో తల్లడిల్లిపోయి తీవ్ర షాక్ కు గురైన అమృత తాజాగా మీడియాతో మాట్లాడింది.

తనను పరామర్శించేందుకు వచ్చిన వారితో.. అంకుల్.. ప్రణయ్ ను నాన్నే చంపించాడంటూ ఆమె రోదనలు అక్కడి వారిని కదిలించి వేస్తున్నాయ్. ప్రణయ్ ను తన తండ్రే చంపించి ఉంటారని.. ఆయన ఆలోచనల గురించి తన తల్లి ఎప్పటికప్పుడు చెప్పేదని పేర్కొంది. ప్రణయ్ ను చంపేందుకు చాలాసార్లు రెక్కీ నిర్వహించినట్లుగా వాపోయింది.

తాను.. ప్రణయ్ నవ్వుకుంటూ వెళుతున్న వేళ పక్క నుంచి ఎవరో గట్టిగా కొట్టారని.. వెంటనే ప్రణయ్ కిందకు పడిపోయాడని.. అనంతరం దాడి చేసి చంపేశారని భోరుమంది. దాడి చేసిన వారిని తాను స్పష్టంగా చూడలేదంది. తన కదలికల్ని తన తండ్రి ఎప్పటికప్పుడు తెలుసుకునే వారని.. తమపై తన తండ్రి నిఘా ఉంచారన్నారు.

గోల్డ్ షాపులో ఉన్నావ్.. బ్యూటీప్లారర్ లో ఉన్నావంటూ తన తల్లి తనకు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్పేదని.. తన తండ్రికి ఎవరో ఫోన్ చేసిన తన కదలికల్ని చెప్పేవారని తన తల్లి తనతో చెప్పినట్లుగా పేర్కొంది.

ప్రస్తుతం తాను ఐదు నెలల గర్బిణినని.. ఆ విషయం అమ్మకు చెప్పానని.. అప్పటి నుంచి తన తల్లి తన గురించి ఎప్పటికప్పుడు ఫోన్ చేసి యోగక్షేమాల గురించి అడిగేదని అమృత చెప్పింది. తాను గర్బవతి అన్న విషయం తెలిసిన తన తండ్రి మాత్రం తన గర్బాన్ని తీయించుకోవాలని ఒత్తిడి చేసేవారన్నారు. ప్రణయ్ చనిపోయిన వెంటనే జరిగిన ఘటన గురించి తన తండ్రికి ఫోన్ చేశానని.. ఎవరో దాడి చేసి ప్రణయ్ ను చంపేశారని చెబితే.. సరిగా వినిపించటం లేదని ఫోన్ పెట్టేశారని చెప్పారు. తనపైనా దాడి జరిగిందని చెబితే పట్టించుకోలేదని.. ఆసుపత్రికి వెళ్లాలని చెప్పినట్లుగా పేర్కొంది.

తర్వాత తాను ప్రణయ్ తండ్రికి ఫోన్ చేశానని.. ప్రణయ్ ను చంపేస్తే తాను వెనక్కి వస్తాననే ఇలా చేశారని.. అయితే తన తండ్రి వద్దకు వెళ్లేది లేదని అమృత చెప్పింది. ప్రణయ్ చాలా మంచివాడని.. దారుణంగా చంపేశారంటూ కన్నీటి పర్యంతమైంది. తన కళ్ల ముందే ప్రణయ్ ను చంపిన వైనాన్ని చెబుతూ.. అలాంటి పరిస్థితుల్లో ప్రణయ్ ను చూస్తానని తాను ఎప్పుడూ అనుకోలేదని వాపోయింది.

తనను ప్రణయ్ వద్దకు తీసుకెళ్లాలని తనను పరామర్శించటానికి వచ్చిన వారిని అమృత వేడుకొంది. అంకుల్ ప్లీజ్.. ప్రణయ్ ను చూడకపోతే ఎట్లా?  ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి? ప్రణయ్ ను నాకు దక్కకుండా చేసిన వాళ్లని చంపేయండి అంకుల్ అంటూ వేదనను వ్యక్తం చేసింది. గర్బిణి కావటంతో ఆమె రెస్ట్ తీసుకోవాలంటూ వైద్యులు అమృతకు సూచిస్తున్నారు. ఆమె ఆవేదన అందరి కంటతడి పెట్టిస్తోంది.

ఆఫీసర్ కొడుకు బలుపు..రేప్…దాడి

ఆఫీసర్ కొడుకు బలుపు..రేప్…దాడి

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ పోలీస్ అధికారి కొడుకు ఓ యువతిని విచక్షణ రహితంగా కొట్టాడు. రోహిత్ తోమర్ అనే యువకుడు తన స్నేహితుడి బీపీఓకు యువతిని పిలిపించి దాడి చేశాడు. ఈ ఘటనను అతని స్నేహితుడు వీడియో తీశాడు.  మహిళను కిందపడేసి కాలితో తన్నుతున్న దారుణంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఈ ఘటన ఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆఫీస్ లో ఈ నెల 2వ తేదీన జరిగింది.ఘటనకు సంబంధించిన వీడియోలు బయటికి రావటంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. దాడి చేసిన రోహిత్ తండ్రి నార్కో డ్రగ్స్ విభాగంలో ఎ.ఎస్.ఐ గా పనిచేస్తున్నాడు.

ఈ వీడియో ఫుటేజ్ ఆధారంగా రోహిత్ పై కేసు నమోదు చేశారు. తనపై రోహిత్ అత్యాచారానికి ప్రయత్నించాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో అతనిపై అత్యాచారం కేసును కూడా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా ఆ దుర్మార్గుడి గురించి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. అదే వీడియో చూపి తనను తీవ్ర భయభ్రాంతులకు గురిచేశాడంటూ రోహిత్ సన్నిహితురాలిగా పేర్కొంటున్న మరో యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిపై గురువారం తిలక్నగర్ పోలీసు స్టేషన్ లో….శుక్రవారం ఉత్తమ్ నగర్ పీఎస్ లో వరుసగా కేసులు నమోదైనాయి. కాగా ఈ వీడియోలు వైరల్ అయిన నేపథ్యంలో స్పందించిన కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్.. ఢిల్లీ పోలీస్ కమిషనర్ తో మాట్లాడారు. నిందితుడు రోహిత్ తోమర్ ను గుర్తించి అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.