మూవీ రివ్యూ : ‘సామి’

మూవీ రివ్యూ : ‘సామి’

చిత్రం : సామి
నటీనటులు: విక్రమ్ – కీర్తి సురేష్ – ఐశ్వర్యా రాజేష్ – బాబీ సింహా – ప్రభు – సూరి తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం: ప్రియన్ – వెంకటేష్ అంగురాజ్
నిర్మాత: శిబు తమీన్స్
రచన – దర్శకత్వం: హరి

ఒకప్పుడు ‘సామి’.. పితామగన్’.. ‘అపరిచితుడు’ లాంటి సినిమాలతో దక్షిణాదిన పెద్ద హీరోగా ఎదిగాడు విక్రమ్. కానీ పుష్కర కాలం నుంచి అతడికి సరైన విజయం లేదు. మధ్యలో ఎన్నో ప్రయత్నాలు చేసి విఫలమైన విక్రమ్.. ‘సామి’తో తనకు పెద్ద కమర్షియల్ సక్సెస్ ఇచ్చిన హరితో జత కట్టాడు. ‘సామి’కి సీక్వెల్ చేశాడు. ‘సామి’ పేరుతో ఈ రోజే తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

రామస్వామి (విక్రమ్) చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయినా.. తన తాతయ్య అండతో కష్టపడి పైకెదుగుతాడు. ఢిల్లీలో ఒక మంత్రి దగ్గర మేనేజర్ గా పని చేస్తూ సివిల్స్ ప్రిపేరవుతుంటాడు. మంత్రి కూతురు తనను ప్రేమించినా పట్టించుకోకుండా కెరీర్ మీదే దృష్టిపెడతాడు. అతను కోరుకున్నట్లే సివిల్స్ పరీక్షలో పాసై శిక్షణ కోసం ముస్సోరి వెళ్తాడు. అది పూర్తయ్యాక రామస్వామి కలెక్టరవుతాడని తాతయ్య ఆశిస్తే అతనేమో ఐపీఎస్ తీసుకుంటాడు. అప్పుడే రామస్వామి గతం గురించి తెలుస్తుంది. అతడి తల్లిదండ్రుల్ని విజయవాడకు చెందిన రావణ భిక్షు అనే రౌడీ చంపేశాడని వెల్లడవుతుంది. దీంతో అతడిపై ప్రతీకారానికి సిద్ధపడి విజయవాడకు బయల్దేరతాడు సామి. మరి ఈ పోరులో ఎవరు గెలిచారన్నది మిగతా కథ.

కథనం – విశ్లేషణ:

‘సామి’లో హీరో సివిల్స్ ప్రిపేరవుతుంటాడు. హీరో ప్రిపేరయ్యాడంటే పరీక్ష పాసవ్వకుండా ఎలా ఉంటాడు? అతనొక్కడే కాదు.. ఫ్రెండ్ బ్యాచ్ కూడా పాసైపోతుంది. తర్వాత ట్రైనింగ్ ముగుస్తుంది. ఏ సర్వీస్ కావాలో తేల్చుకోవడానికి ఉన్నతాధికారులు పిలుస్తారు. లోపలికి వెళ్లేముందు హీరోకు ఒక పోలీస్ అధికారి ఖాకీ చొక్కా తాకుతుంది. అంతే.. ఐఏఎస్ అడగాలనుకున్నవాడు కాస్తా ఆ తాకిడితో ఐపీఎస్ అడుగుతాడు. అప్పుడే కాదు.. మరో సందర్భంలో పురోహితుడిగా తాతతో కలిసి ఓ పెళ్లి జరిపిస్తుంటే.. అక్కడా ఖాకీ చొక్కా తగిలి వీర లెవెల్లో ఫైట్ చేసేస్తాడు. దీనికి కారణం హీరో తండ్రి ఒకప్పుడు పోలీస్ కావడమేనట. ఈ సీన్లు చూసి ‘సామి’ హార్రర్ టచ్ ఉన్న ఫాంటసీ సినిమా ఏమో అనుకుంటాం. కానీ ఇది సగటు యాక్షన్ సినిమానే. ఒక మామూలు పోలీస్ స్టోరీనే. ఇలాంటి విచిత్ర విన్యాసాలు ఓన్నో చూడొచ్చు  ‘సామి’  లో. మాస్ సినిమా అంటే ఏం చేసినా చెల్లిపోతుందేమో అన్న భ్రమతో తీసినట్లుగా అనిపిస్తుంది ‘స్వామి’ చూస్తున్నంతసేపూ.

ఒకప్పుడు తమిళంలో కొత్త తరహా సినిమాలొచ్చేవి. తెలుగులో రొటీన్ సినిమాల వరద సాగేది. కానీ ఇప్పుడు సీన్ రివర్సవుతున్నట్లుంది. మన దర్శకుల తీరు మారింది. ప్రేక్షకుల అభిరుచి మారింది. ఇక్కడ కొత్తదనానికి పట్టం పడుతుంటే.. తమిళంలో మాత్రం రొటీన్ మాస్ సినిమాలొస్తున్నాయి. ఆ కోవలోని చిత్రమే ‘సామి’ . దశాబ్దంన్నర కిందట తెలుగులో ‘లక్ష్మీనరసింహ’గా రీమేక్ అయిన తమిళ చిత్రం ‘సామి’కి ఇది సీక్వెల్. అప్పటికే ఎన్నో పోలీస్ స్టోరీలు చూశాం కానీ.. అది చాలా భిన్నంగా కనిపించింది. విచిత్రమైన మనస్తత్వం.. దూకుడు ఉన్న పోలీస్ గా హీరో పాత్రను భలేగా తీర్చిదిద్ది ప్రేక్షకుల్ని మెప్పించాడు హరి. అప్పుడు సినిమాకు హీరో పాత్ర చిత్రణ ప్రత్యేక ఆకర్షణగా నిలిస్తే.. ఈసారి ప్రధాన పాత్ర చాలా సాధారణంగా తయారైంది హీరో పాత్రలోనే కాదు.. కథలోనూ ఏ కొత్తదనం.. విశేషం లేకపోయింది.

ఒక హిట్ సినిమాకు సీక్వెల్ తీయడం అంత సులువు కాదు. ముందే ప్రేక్షకులు ఒక అంచనాతో ఉంటారు. ఐతే అసలే అంచనాలు లేకుండా చూసినా ‘స్వామి’ చాలా బ్యాడ్ అనిపిస్తుంది. మామూలుగా ఆరంభ సన్నివేశం నుంచే తన సినిమాల్ని పరుగెత్తించే హరి.. ‘స్వామి’లో మాత్రం ప్రథమార్ధాన్ని నీరసంగా నడిపించాడు. పేలవమైన ప్రేమకథ.. విసుగెత్తించే కామెడీ ప్రథమార్ధాన్ని నీరుగార్చేశాయి. ఇంటర్వెల్ ముంగిట అసలు కథ మొదలు కావడంతో ఆసక్తి మొదలవుతుంది. ఇక ద్వితీయార్ధమంతా హీరో.. విలన్ హోరాహోరీగా తలపడతారని ఆశిస్తాం. కానీ అక్కడక్కడా కొన్ని మెరుపులున్నప్పటికీ ఆసక్తికరమైన ఎపిసోడ్లేమీ పడలేదు. యాక్షన్ సన్నివేశాలు మాస్ ను మెప్పించేలా ఉన్నా.. కథ పరంగా పెద్దగా మలుపులు లేకపోయాయి. ‘సామి’.. ‘సింగం’ సిరీస్ ల్లోని పోలీస్ పాత్రల తరహాలో ఈ క్యారెక్టర్ పేలలేదు. హరి ఎంచుకున్న కథతో పాటు అతడి నరేషన్ కూడా ఔట్ డేట్ అయిపోవడంతో ‘సామి’ చాలా త్వరగా ప్రేక్షకుల ఆసక్తిని చంపేస్తుంది. మాస్ ను మెప్పించే కొన్ని అంశాలున్నప్పటికీ.. వాళ్లకు కూడా ఇది సంతృప్తినేమీ ఇవ్వదు.

నటీనటులు:

విక్రమ్ రామస్వామి పాత్రకు తగ్గట్లే పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. మాస్ ప్రేక్షకులు మెచ్చే రీతిలో అతను కనిపించాడు. హీరో రౌద్రం చూపించే సన్నివేశాల్లో విక్రమ్ నటన ఆకట్టుకుంటుంది. ఐతే విక్రమ్ నుంచి మామూలుగా ప్రేక్షకులు ఆశించే వైవిధ్యం ఏమీ ఇందులో కనిపించదు. కీర్తి సురేష్ పాత్రకు అంత ప్రాధాన్యం లేదు. ఆమె మామూలుగానే కనిపిస్తుంది. తన అందంతో ఆకట్టుకుంటుంది. ఐశ్వర్యా రాజేష్ గురించి చెప్పడానికేమీ లేదు. విలన్ పాత్రలో కనిపించిన బాబీ సింహా ఆకట్టుకున్నాడు. విక్రమ్ స్థాయికి అతను సరిపోతాడా అని మొదట్లో అనిపిస్తుంది కానీ.. పోను పోను అలవాటు పడతాం. ప్రభుది అంత గుర్తింపు ఉన్న పాత్రేమీ కాదు. సూరి కామెడీ మరీ లౌడ్ గా అనిపిస్తుంది. మాస్ ను ఆకట్టుకోవచ్చు.

సాంకేతిక వర్గం:

దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో ఏ ప్రత్యేకతా లేదు. ఒక్క పాట కూడా ప్రత్యేకంగా అనిపించదు. రొటీన్ గా వాయించేశాడు. మాస్ సినిమాల్లో కూడా మంచి మెలోడీలు అందించే దేవిశ్రీ ఈసారి మాత్రం అలాంటి పాట ఒక్కటీ ఇవ్వలేదు. పాటల్లో తమిళ వాసనలు ఎక్కువయ్యాయి. నేపథ్య సంగీతం సినిమాకు తగ్గట్లుగా సాగుతుంది. ఛాయాగ్రహణం హరి స్టయిల్లో సాగుతుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. పవర్ ఫుల్ పోలీస్ స్టోరీలు తీయడంలో సిద్ధహస్తుడైన దర్శకుడు హరి.. ఈసారి తనదైన ముద్ర వేయలేకపోయాడు. ‘సామి’.. ‘సింగం’ సిరీస్ లోని సినిమాల మాదిరి ఇందులో మలుపులు.. ఆసక్తికర సబ్ ప్లాట్స్ లేకపోయాయి. చాలా మామూలు కథాకథనాలతో బండి లాగించేశాడు. ఎక్కడా కొత్తదనం లేకుండా పాత స్టయిల్లో లౌడ్ గా సినిమాను నడిపించాడు.

చివరగా: సామి.. ఔట్ డేట్ అయిపోయాడు

రేటింగ్- 2/5

నన్ను దోచుకుందువటే

నన్ను దోచుకుందువటే

చిత్రం : ‘నన్ను దోచుకుందువటే’

నటీనటులు: సుధీర్ బాబు – నభా నటేష్ – నాజర్ – పృథ్వీ – తులసి – సుదర్శన్ – వైవా హర్ష – జీవా – జబర్దస్త్ వేణు తదితరులు
సంగీతం: అజనీష్ లోక్ నాథ్
ఛాయాగ్రహణం: సురేష్ రగుతు
నిర్మాత: సుధీర్ బాబు
రచన – దర్శకత్వం: ఆర్.ఎస్.నాయుడు

ఒడుదొడుకులతో సాగుతున్న సుధీర్ బాబు కెరీర్ ‘సమ్మోహనం’తో కొంచెం గాడిన పడింది. నటుడిగా ఈ సినిమా అతడికి మంచి పేరు తెచ్చిపెట్టడమే కాదు.. మంచి విజయం కూడా సాధించింది. ఇప్పుడు సుధీర్ నుంచి వచ్చిన ‘నన్ను దోచుకుందువటే’ ప్రోమోలతో ఆకట్టుకుంది. ఈ చిత్రానికి సుధీర్ నిర్మాత కూడా. ఆర్.ఎస్.నాయుడు అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

కార్తీక్ (సుధీర్ బాబు) ఒక ఐటీ కంపెనీలో మేనేజర్. ఛండశాసనుడిలా కనిపించే కార్తీక్ అంటే అతడి టీంలోని వాళ్లందరికీ హడల్. పని తప్ప వేరే ధ్యాస లేదన్నట్లుగా అతడి జీవితం సాగుతుంటుంది. తన కుటుంబాన్ని కూడా అతను పట్టించుకోడు. ఇలాంటి స్థితిలో అతడికి మరదలితో పెళ్లి చేయాలని చూస్తాడు తండ్రి (నాజర్). మరదలు వేరే అబ్బాయితో ప్రేమలో ఉందని తెలిసి.. ఈ పెళ్లి తప్పించడానికి తాను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు అబద్ధం చెబుతాడు కార్తీక్. కాలేజీలో చదువుతూ షార్ట్ ఫిలిమ్స్ చేసే మేఘన (నభా నటేష్) కార్తీక్ తండ్రిని నమ్మించడానికి అతడి ప్రేయసిగా నటించడానికి ఒప్పుకుంటుంది. ఈ క్రమంలో ఆమె కార్తీక్ కు దగ్గరవుతుంది. కార్తీక్ కూడా ఆమెను ఇష్టపడతాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ తమ ప్రేమను వ్యక్తం చేయరు. ఇద్దరూ దూరమవ్వాల్సిన పరిస్థితి కూడా తలెత్తుంది. మరి వీళ్లిద్దరూ ఎలా కలిశారన్నదే మిగతా కథ.

కథనం – విశ్లేషణ:

‘నన్ను దోచుకుందువటే’ సింపుల్ గా సాగిపోయే ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్. కథ పరంగా ఇందులో కొత్తదనం ఏమీ కనిపించదు. అనుకోకుండా పరిచయమై ప్రేమలో పడే ఒక జంట.. వారి మధ్య అపార్థాలు.. ఆపై ఇద్దరూ కలిసిపోయే ఒక సగటు కథతోనే ఇది తెరకెక్కింది. ఐతే కొత్త దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు ఈ ప్రెడిక్టబుల్ స్టోరీని ఉన్నంతలో ఆసక్తికరంగానే చెప్పాడు. హీరో హీరోయిన్ల నేపథ్యాలు ఈ కాలానికి తగ్గట్లుగా.. యువత బాగా కనెక్టయ్యేలా ఉండటం.. ఆ నేపథ్యాల్ని వినోదాత్మకంగా చూపించడం ‘నన్ను దోచుకుందువటే’లో అతి పెద్ద ప్లస్ పాయింట్స్. కాలక్షేపానికి ఢోకా లేదనిపించే ఈ చిత్రం ప్రత్యేకమైన అనుభూతినైతే కలిగించదు. కొత్తదనం లేని కథ.. అక్కడక్కడా కొంచెం నెమ్మదిగా సాగే కథనం దీనికి మైనస్ అయ్యాయి.

కథ కొత్తగా లేకపోయినా.. కథనంలో కొంచెం వైవిధ్యం చూపించగలిగితే.. ఈ తరం ప్రేక్షకుల అభిరుచికి తగ్గ వినోదం పండించగలిగితే చాలని నమ్మాడు డెబ్యూ డైరెక్టర్ ఆర్.ఎస్.నాయుడు. ఇందులో హీరో ఐటీ కంపెనీ మేనేజర్. హీరోయినేమో కాలేజీలో చదువుతూ షార్ట్ ఫిలిమ్స్ లో నటించే అమ్మాయి. ఇవి రెండూ కూడా ట్రెండీగా ఉండటం.. ఈ పాత్రలకు సంబంధించి ఆసక్తికర సెటప్ తో సన్నివేశాలు రాసుకోవడం కలిసొచ్చింది. మరీ స్ట్రిక్ట్ గా ఉంటూ తన కింది స్థాయి ఉద్యోగుల్ని వేయించుకునే తినే బాస్ గా సుధీర్ పాత్ర ఆరంభంలో సినిమాపై మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు వినోదం పంచుతాయి. ఆ తర్వాత హీరోయిన్ పాత్ర ప్రవేశంతో కథనం మరింత ఊపందుకుంటుంది. సినిమాలో అతి పెద్ద విశేషం హీరోయిన్ పాత్ర.. ఆ పాత్రలో కొత్తమ్మాయి నభా నటేష్ నటనే అంటే అతిశయోక్తి కాదు.

హీరోయిన్ పాత్రపై దృష్టిపెడితే.. సినిమాకే బలం వస్తుందని దర్శకుడు గుర్తించాడు. ఆ పాత్రను కొంచెం కొత్తగా చూపించాడు. షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ తాను పెద్ద ఆర్టిస్టునని ఫీలైపోయే అమ్మాయిగా నభా నటేష్ ఆకట్టుకుంది. ప్రథమార్ధాన్ని ఈ క్యారెక్టరే నడిపించింది.  పాత్రకు తగ్గట్లు నభా నటన కూడా బాగా కుదరడంతో ఆమెతో ముడిపడ్డ సన్నివేశాలన్నీ మెప్పిస్తాయి. హీరో హీరోయిన్ల కాంబినేషన్లో వచ్చే షార్ట్ ఫిలిం షూటింగ్ సీన్ బాగా పేలింది.  కథలో పెద్దగా మలుపులేమీ లేకపోయినా.. సన్నివేశాలు చకచకగా సాగిపోవడంతో ప్రథమార్థంలో ఈజీగా టైంపాస్ అయిపోతుంది. ప్రత్యేకంగా కామెడీ ట్రాకులేమీ లేకుండా.. సందర్భానుసారంగా వినోదం పండించడం మెప్పిస్తుంది.

ఐతే అసలు కథ చెప్పాల్సి వచ్చినపుడు చాలామంది కొత్త దర్శకుల్లో కనిపించే తడబాటునే ఆర్.ఎస్.నాయుడు కూడా చూపించాడు. అతడి పట్టు కూడా కామెడీ మీదే ఉండటంతో.. కొంచెం సీరియస్ గా సాగే ద్వితీయార్ధంలో బలహీనతలు బయటపడ్డాయి. ఒక దశ దాటాక కథ ముందుకే సాగదు. ప్రథమార్ధంలో ప్రత్యేకంగా అనిపించే హీరోయిన్ పాత్రను రెండో అర్ధంలో తేల్చేశారు. ఆ పాత్రకు ఒక వ్యక్తిత్వం లేనట్లు కనిపిస్తుంది. హీరో తనను తిరస్కరించినా ఆమెలో దాని తాలూకు బాధ ఏమీ కనిపించదు. ఎంత లైట్ హార్టెడ్ పర్సన్ అయినా.. అసలేమీ పట్టనట్లు ఉండటంలో లాజిక్ కనిపించదు. హీరో హీరోయిన్ల మధ్య దూరం పెరగడానికి దారి తీసే సన్నివేశాలు కొంచెం ఫోర్స్డ్ గా అనిపిస్తాయి. ఐతే ప్రి క్లైమాక్స్ తండ్రీ కొడుకుల మధ్య సెంటిమెంటు మాత్రం బాగా పండింది. నాజర్ తన అనుభవంతో ఈ ఎపిసోడ్ ను నిలబెట్టారు. ముగింపులో దర్శకుడు మళ్లీ తన బలాన్ని నమ్ముకున్నాడు. ఒక సరదా సన్నివేశంతో సినిమాకు తెరదించాడు. ఓవరాల్ గా చెప్పాలంటే ‘నన్ను దోచుకుందువటే’ టైంపాస్ చేయడానికి ఓకే అనిపించే ఒక సింపుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్.

నటీనటులు:

‘సమ్మోహనం’ తర్వాత సుధీర్ బాబు మరోసారి సటిల్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇంతకుముందులా కాకుండా అతను ఆత్మవిశ్వాసంతో నటించాడు. భావోద్వేగాలు లోలోన దాచుకుని పైకి చాలా టఫ్ గా కనిపించే పాత్రలో సుధీర్ మెప్పించాడు. ఎక్కడా ఎగ్జైట్ కాకుండా నటించడం ఆకట్టుకుంటుంది. చివర్లో వచ్చే సెంటిమెంటు సీన్లో మినహాయిస్తే సుధీర్ బాబు అంతటా బాగానే చేశాడు. షార్ట్ ఫిలింలో నటించే నటించే సీన్లో అతడి నటన బాగా నవ్విస్తుంది. హీరోయిన్ నభా నటేష్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. తెలుగులో తొలి సినిమా అయినా.. ఏ తడబాటూ లేకుండా కాన్ఫిడెంటుగా నటించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. పాత్ర కూడా బాగుండటంతో నభా ప్రేక్షకులపై బలమైన ముద్రే వేస్తుంది. మధ్యలో వదిలేశారు కానీ.. ఈ పాత్రను ఇంకా బాగా తీర్చిదిద్ది ఉండొచ్చు. నాజర్ కనిపించేది తక్కువ సన్నివేశాల్లోనే అయినా తన అనుభవం చూపించారు. ముఖ్యంగా ప్రి క్లైమాక్స్ లో ఆయన నటన గుర్తుండిపోతుంది. తులసి కూడా బాగానే చేసింది. వైవా హర్ష నవ్వించాడు. మిగతా వాళ్లంతా ఓకే.

సాంకేతిక వర్గం:

కంటెంట్ పరంగా జస్ట్ ఓకే అనిపించే సినిమాల్లో పాటలు బాగుండటం చాలా అవసరం. కానీ ‘నన్ను దోచుకుందువటే’కు మ్యూజిక్ బలం కాలేకపోయింది. ఇలాంటి రొమాంటిక్ కామెడీలకు తగ్గ సంగీతాన్ని అజనీష్ లోక్ నాథ్ సమకూర్చలేకపోయాడు. పాటలు మామూలుగా అనిపిస్తాయి. ఒక్క పాట కూడా గుర్తుంచుకునేలా లేదు. నేపథ్య సంగీతం కొన్ని చోట్ల బాగున్నా.. కొన్ని చోట్ల మరీ లౌడ్ గా అనిపిస్తుంది. మామూలుగా సాగే సన్నివేశాల్లో కూడా నేపథ్య సంగీతంతో ఏదో జరిగిపోతున్న ఫీల్ కలిగించే ప్రయత్నం చేయడం చిరాకు పెడుతుంది. సన్నివేశాల్లో ఉన్న సింప్లిసిటీ సంగీతంలో లేకపోయింది. సురేష్ రగుతు ఛాయాగ్రహణం ఆకట్టుకుంది. కెమెరా పనితనం సినిమా శైలికి తగ్గట్లుగా సాగింది. సుధీర్ బాబు సంస్థ నిర్మాణ విలువల్లో రాజీ పడలేదు. సినిమాకు అవసరమైన మేర ఖర్చు చేసింది. ఇక ఆర్.ఎస్.నాయుడు  సిచ్యువేషనల్ కామెడీతో తాను ఈ ట్రెండుకు తగ్గ దర్శకుడినని చాటాడు. అతను హడావుడి లేకుండా సటిల్ గా కామెడీ పండించిన విధానం ఆకట్టుకుంటుంది. కానీ తొలి సినిమా కోసం అతను ఎంచుకున్న కథ మాత్రం సాధారణంగా అనిపిస్తుంది. కథలోనూ కొత్తదనం చూపించగలిగితే అతను తనదైన ముద్ర వేయగలిగేవాడు.

చివరగా: నన్ను దోచుకుందువటే.. టైంపాస్ రొమాంటిక్ ఎంటర్ టైనర్

రేటింగ్- 3/5

‘యూ టర్న్’

‘యూ టర్న్’

చిత్రం : ‘యూ టర్న్’

నటీనటులు: సమంత – ఆది పినిశెట్టి – రాహుల్ రవీంద్రన్ – భూమిక చావ్లా – నరేన్ – రవిప్రకాష్ తదితరులు
సంగీతం: పూర్ణచంద్ర తేజస్వి
ఛాయాగ్రహణం: నికేత్ బొమ్మిరెడ్డి
నిర్మాతలు: శ్రీనివాస చిట్టూరి – రాంబాబు బండారు
రచన – దర్శకత్వం: పవన్ కుమార్

కథానాయికగా తిరుగులేని స్థాయిని అందుకున్న సమంత తొలిసారిగా నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమా ‘యూ టర్న్’. కన్నడలో ఇదే పేరుతో విజయవంతమైన చిత్రం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా వినాయక చవితి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ థ్రిల్లర్ మూవీ విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

రచన (సమంత) ఒక పత్రికలో విలేకరిగా పని చేస్తుంటుంది. ఆమెకు అదే ఆఫీసులో పని చేసే రాహుల్ (రాహుల్ రవీంద్రన్) అంటే ఇష్టం. అతడికీ ఆమె మీద ఆసక్తి ఉంటుంది. రచన తన వృత్తిలో భాగంగా ఒక ఫ్లై ఓవర్ మీద డివైడర్ ను జరిపి ట్రాఫిక్ నిబంధనల్ని అతిక్రమిస్తున్న వారి వివరాలు సేకరించి.. వారి మీద ఒక స్టోరీ చేయాలనుకుంటుంది. ఐతే ఆమె అలా వివరాలు రాబట్టిన ఒక వ్యక్తి హఠాత్తుగా చనిపోతాడు. దీంత రచనను పోలీసులు విచారించడం మొదలుపెడతారు. ఈ క్రమంలో వారికి విస్మయపరిచే విషయాలు తెలుస్తాయి. రచన వివరాలు సేకరించిన వాళ్లందరూ ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడవుతుంది. మరి వాళ్లందరివీ సహజ మరణాలేనా.. లేక హత్యలా.. వీటికి రచనకు ఏమైనా సంబంధం ఉందా.. అన్న విషయాలు తెరమీదే చూసి తెలుసుకోవాలి.

కథనం – విశ్లేషణ:

‘యూ టర్న్’ సందేశంతో ముడిపడ్డ ఒక సూపర్ నేచురల్ థ్రిల్లర్. సూపర్ నేచురల్ అనగానే లాజిక్ అనే మాట పక్కకు వెళ్లిపోతుంది. ఈ అడ్వాంటేజీని ఉపయోగించుకుని దర్శకుడు పవన్ కుమార్ ‘యూ టర్న్’ను ఒక ఆసక్తికర థ్రిల్లర్ గా మలిచాడు. తొలి సినిమా ‘లూసియా’తోనే తాను విలక్షణమైన దర్శకుడినని చాటుకున్న పవన్ కుమార్.. రెండో ప్రయత్నంలోనూ భిన్నమైన సినిమానే అందించాడు. కొత్తగా అనిపించే కథ.. ఎక్కడా పక్కదారి పట్టకుండా ఆసక్తికరంగా.. కథతో పాటే సాగే కథనం.. ప్రధాన పాత్రధారుల అభినయం.. ‘యూ టర్న్’కు ప్రధాన ఆకర్షణలు. థ్రిల్లర్ సినిమాల్లో సస్పెన్స్ ఫ్యాక్టర్ ను డీల్ చేయడం.. చివరి దాకా ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేయడం అత్యంత కీలకమైన విషయాలు. ఈ రెండు విషయాల్లో పవన్ కుమార్ విజయవంతమయ్యాడు. థ్రిల్లర్ సినిమాల ప్రేమికుల్ని ‘యూ టర్న్’ నిరాశ పరచదు.

పాత్రల్ని పరిచయం చేసి.. కథతో సంబంధం లేకుండా ఊరికే కొన్ని సన్నివేశాల్ని పేర్చి.. ఏ ఇంటర్వెల్ దగ్గరో అసలు కథలోకి వెళ్లడం లాంటిదేమీ చేయకుండా.. నేరుగా మొదట్లోనే కథను ఆరంభించాడు దర్శకుడు పవన్ కుమార్. కథనం ఊపందుకోవడానికి కొంచెం సమయం పట్టినప్పటికీ.. కథలోని తొలి మలుపు దగ్గర్నుంచి ఉత్కంఠ మొదలవుతుంది. సన్నివేశాలు ప్రేక్షకుడి ఊహకు అందకుండా సాగుతూ ఆసక్తి రేకెత్తిస్తాయి. రిపోర్టర్ అయిన కథానాయిక తన స్టోరీ కోసం వివరాలు సేకరించిన వాళ్లందరూ చనిపోయినట్లు వెల్లడి కావడంతో అక్కడి నుంచి తర్వాత ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ ప్రేక్షకుల్ని వెంటాడుతుంది. సమంతను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి విచారించే దగ్గర్నుంచి కథనం మంచి ఫ్లోలో సాగుతుంది. ద్వితీయార్ధంలో కొంచెం వేగం తగ్గినా.. సస్పెన్స్ కొనసాగిస్తూ ఆసక్తి సన్నగిల్లిపోకుండా చూసుకోవడంతో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

ముందే అన్నట్లు ఇది సూపర్ నేచురల్ సినిమా కాబట్టి లాజిక్కుల గురించి పట్టించుకోకూడదు. అయినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం దర్శకుడు మరీ ఎక్కువ లిబర్టీ తీసుకున్నాడనిపిస్తుంది. థ్రిల్లర్ సినిమా కాస్తా చివర్లో హార్రర్ టర్న్ తీసుకోవడం ప్రేక్షకులకు అంతగా రుచించకపోవచ్చు. అలాగే సగటు థ్రిల్లర్ చిత్రాలతో పోలిస్తే కొంచెం నిడివి ఎక్కువైంది. కొన్ని అనవసర సన్నివేశాలు అక్కడక్కడా కథనంలో వేగం తగ్గించేశాయి. తక్కువ సన్నివేశాల్లోనే లాగించినప్పటికీ రొమాంటిక్ ట్రాక్ బోర్ కొట్టిస్తుంది. ప్రి క్లైమాక్స్ ముంగిట కథలో బిగి మిస్ అయింది. అంతకుముందున్న ఇంటెన్సిటీ ఇక్కడ కనిపించలేదు. ఈ ప్రతికూలతల సంగతి పక్కన పెడితే.. కొత్తదనంతో కూడిన థ్రిల్లర్ సినిమాల్ని ఇష్టపడే వాళ్లకు ‘యూ టర్న్’ నచ్చుతుంది. ఆ వర్గం ప్రేక్షకుల్ని దాటి ఇది ఎక్కువమందికి రీచ్ అవుతుందా అన్నది మాత్రం సందేహమే.

నటీనటులు:

కథాకథనాలే బలంగా సాగే ‘యూ టర్న్’లో సమంత తన ప్రత్యేకతను చాటుకుంది. ఆమె స్టార్ పవర్ సినిమాకు ప్లస్ అయింది. సమంత ఈ తరహా సినిమా కొత్త కావడంతో ఆమె కొత్తగానే కనిపిస్తుంది. లుక్.. బాడీ లాంగ్వేజ్.. నటన కొంచెం భిన్నంగా ఉండేలా చూసుకుంది సమంత. ఆమె కెరీర్లో ఇదొక ప్రత్యేకమైన సినిమా అవుతుందనడంలో సందేహం లేదు. ఆది పినిశెట్టి పోలీస్ పాత్రలో సులువుగా ఒదిగిపోయాడు. అతను సిన్సియర్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఆది పాత్రలో.. నటనలో ఆద్యంతం ఒక ఇంటెన్సిటీ కనిపిస్తుంది. రాహుల్ రవీంద్రన్ కు స్కోప్ తక్కువే కానీ.. ఉన్నంతలో బాగానే చేశాడు. భూమిక చాలా తక్కువ సన్నివేశాల్లోనే తన ముద్ర చూపించింది. మిగతా నటీనటులు ఓకే.

సాంకేతికవర్గం:

‘యూ టర్న్’ సాంకేతికంగా ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుంది. పూర్ణచంద్ర తేజస్వి నేపథ్య సంగీతం.. నికేత్ బొమ్మిరెడ్డి ఛాయాగ్రహణం.. థ్రిల్లర్ సినిమాకు ఉండాల్సిన మూడ్ క్రియేట్ చేయడంలో కీలక పాత్ర పోషించాయి. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో బాగున్నాయి. ఇక రచయిత.. దర్శకుడు పవన్ కుమార్ థ్రిల్లర్ జానర్ మీద తనకున్న గ్రిప్ ను చూపించాడు. కథతో పాటు స్క్రీన్ ప్లే విషయంలోనూ కొత్తదనం చూపించాడు. ఇది దర్శకుడి సినిమా అనే విషయం సినిమా అంతటా కనిపిస్తుంది. ఐతే ముగింపు విషయంలో అతను ఇంకొంచెం భిన్నంగా ఆలోచించి ఉంటే బాగుండేదనిపిస్తుంది.

చివరగా: యూ టర్న్.. థ్రిల్ చేస్తుంది

రేటింగ్-2.75/5

శైలజారెడ్డి అల్లుడు

శైలజారెడ్డి అల్లుడు

చిత్రం : ‘శైలజారెడ్డి అల్లుడు’

నటీనటులు: అక్కినేని నాగచైతన్య – అను ఇమ్మాన్యుయెల్ – రమ్యకృష్ణ – మురళీశర్మ – వెన్నెల కిషోర్ – పృథ్వీ – నరేష్ – శత్రు తదితరులు
సంగీతం: గోపీసుందర్
ఛాయాగ్రహణం: నిజార్ షఫి
నిర్మాతలు: నాగవంశీ-పీడీవీ ప్రసాద్
రచన – దర్శకత్వం: మారుతి

కామెడీ ఎంటర్టైనర్లు తీయడంలో దిట్ట అయిన దర్శకుడు మారుతి యువ కథానాయకుడు అక్కినేని నాగచైతన్యతో తీసిన సినిమా ‘శైలజారెడ్డి అల్లుడు’. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ లాగా కనిపించిన ఈ చిత్రం వినాయక చవితి కానుకగా ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

చైతూ (నాగచైతన్య) ఒక పెద్దింటి కుర్రాడు. అతడి తండ్రికి భయంకరమైన ఇగో ఉంటుంది. దాని వల్లే ఆయన కూతురి పెళ్లి సైతం చెడిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తన తండ్రికి జిరాక్స్ కాపీ లాంటి అను (అను ఇమ్మాన్యుయెల్)ను ఇష్టపడతాడు చైతూ. ఆమె కూడా తనను ప్రేమించేలా చేస్తాడు. కానీ చైతూ తండ్రి తొందరపాటు వల్ల అనుకోని పరిస్థితుల్లో వీళ్లిద్దరి నిశ్చితార్థం జరిగిపోతుంది. అప్పుడే వరంగల్ జిల్లాలో పెద్ద నాయకురాలైన శైలజారెడ్డి (రమ్యకృష్ణ) గురించి.. ఆమె ఇగో గురించి చైతూ కుటుంబానికి తెలుస్తుంది. మహా కోపిష్టి అయిన శైలజారెడ్డి తనకు తెలియకుండా జరిగిన కూతురి నిశ్చితార్థం గురించి తెలుసుకుని ఏం చేసింది.. ఆమెను చైతూ ఎలా డీల్ చేశాడు.. చివరికి చైతూ-అను కలిశారా లేదా అన్నది మిగతా కథ.

కథనం – విశ్లేషణ:

మారుతి తీసిన ‘భలే భలే మగాడివోయ్’.. ‘మహానుభావుడు’ సినిమాలకు టిపికల్ గా అనిపించే లీడ్ క్యారెక్టర్లే ప్రధాన ఆకర్షణ. ఆ పాత్రల్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దడం.. వాటి నుంచే ప్రధానంగా వినోదం పండించడం ద్వారా ప్రేక్షకుల మనసులు గెలిచాడు మారుతి. ‘శైలజారెడ్డి అల్లుడు’లో మారుతి హీరో మీద కాకుండా హీరోయిన్.. ఆమె తల్లి పాత్రల మీద దృష్టిపెట్టాడు. విపరీతమైన అహం ఉన్న తల్లీ కూతుళ్ల మధ్య నలిగిపోయే కుర్రాడి కథను చెప్పే ప్రయత్నం చేశాడు. ఐతే ఈ తల్లీ కూతుళ్ల పాత్రల్ని ఆరంభంలో పైకి ఎత్తి.. ఆ తర్వాత దబేల్ మని కింద పడేసేశాడు మారుతి. ఇంట్రోల వరకు బాగా రాసుకుని.. ఆ తర్వాత ఆ పాత్రల్ని చాలా సాధారణంగా మార్చేయడంతో త్వరగా వాటిపై ఆసక్తి పోతుంది. రెక్టర్లు అనుకున్న స్థాయిలో పేలకపోవడం.. అక్కడక్కడా కొన్ని సీన్లలో మినహాయిస్తే మారుతి మార్కు వినోదం కూడా పండకపోవడంతో ‘శైలజారెడ్డి అల్లుడు’ అంచనాలకు దూరంగా ఆగిపోయింది.

‘శైలజారెడ్డి అల్లుడు’ అనే ఆకర్షణీయమైన టైటిల్ పెట్టి శైలజారెడ్డిగా రమ్యకృష్ణను ఎంచుకోవడం అంటే.. సినిమాకు అంతకంటే ఆకర్షణ ఏముంటుంది? ఇక ఈ చిత్రంలో కూడా ఈ పాత్ర గురించి చెప్పేటపుడు బిల్డప్ మామూలుగా ఉండదు. హీరో తండ్రి కోపం వచ్చి కమిషనర్ కు ఫోన్ కలపబోతుంటే.. పక్కనున్న పాత్ర ‘‘మీకు కమిషనర్ తెలిస్తే.. వాళ్లకు సీఎం క్లోజ్’’ అంటూ శైలజారెడ్డి గురించి ఎత్తేస్తుంది. ఇంత చెప్పారు కాబట్టి శైలజారెడ్డి రంగ ప్రవేశంతో వ్యవహారం కొంచెం పెద్ద స్థాయిలో నడుస్తుందని అనుకుంటాం. కానీ తీరా చూస్తే శైలజారెడ్డి తన ఊరిలో భార్యాభర్తల మధ్య వచ్చే గొడవల మీద పంచాయితీలు చేస్తుంటుంది. ఇక ద్వితీయార్దంలో కథంతా కూడా ఇగోతో మాట్లాడ్డం మానేసిన తల్లీకూతుళ్ల మధ్య మళ్లీ మాటలు కలపడం మీద నడుస్తుంది. ఇంత చిన్న ఇష్యూను పెట్టుకుని ఊరికే సాగదీస్తూ ద్వితీయార్ధం మొత్తాన్ని నడిపించాడు మారుతి. కామెడీ వర్కవుటైతే ఇదేమంత పెద్ద విషయంలా అనిపించేది కాదు కానీ.. అది కూడా ఆశించిన స్థాయిలో పండకపోవడంతో వ్యవహారం తేడా కొట్టేసింది.

హీరోయిన్ని తనదాన్ని చేసుకోవడం కోసం హీరో ఆమె ఇంట్లోకి వేరే ఐడెంటిటీతో అడుగుపెట్టి.. తన తెలివితేటలతో సమస్యలన్నీ చక్కబెట్టేసి కథను సుఖాంతం చేసే వ్యవహారాలు ఔట్ డేట్ అయిపోయి చాలా కాలమే అయింది. మళ్లీ మారుతి అదే పాత ఫార్ములాను ఫాలో అయిపోయాడు. ప్రథమార్ధంలో హీరో హీరోయిన్ల ప్రేమకథ కూడా సాధారణంగా అనిపిస్తుంది. అక్కడక్కడా వెన్నెల కిషోర్ కామెడీ పంచులు మినహాయిస్తే ప్రథమార్ధంలో చెప్పుకోదగ్గ మెరుపులేమీ లేవు. అను ఇమ్మాన్యుయెల్ పాత్ర మొదట్లో బాగా అనిపించినా.. ఆ తర్వాత నిలకడ తప్పడంతో ఆసక్తి సన్నగిల్లిపోతుంది. ప్రతి సన్నివేశంలో ఇగో ఇగో అంటూ ఒకటే ఊదరగొట్టేస్తూ ఉంటారే తప్ప.. ఆ పాత్ర తన ఇగోను చూపించే సరైన సన్నివేశాలే లేవు. మారుతి కేవలం డైలాగుల ద్వారా పాత్ర లక్షణాలు చెప్పడానికి ప్రయత్నించాడు తప్ప.. దాన్ని ఎస్టాబ్లిష్ చేసే సన్నివేశాలు లేకపోవడంతో ఆ పాత్ర తేలిపోయింది.

సాధారణంగా మారుతి పాత్రలు చాలా సహజంగా.. జనాలు రిలేట్ చేసుకునేలా ఉంటుంటాయి. కానీ ఇందులో మురళీ శర్మ పాత్ర చూస్తే మారుతి తన టచ్ కోల్పోయాడేమో అనిపిస్తుంది. ఇంటర్వెల్ ముంగిట వచ్చే సన్నివేశాల్లో ఆ పాత్ర విపరీత ప్రవర్తన మామూలు ఇరిటేషన్ తెప్పించదు. శైలజారెడ్డి పాత్రను పండించడానికి రమ్యకృష్ణ తన వంతు ప్రయత్నం చేసినా.. దాన్ని సరిగా తీర్చిదిద్దకపోవడంతో అది కూడా ఆకర్షణ కాలేకపోయింది. వెన్నెల కిషోర్ ద్వితీయార్ధంలోనూ కొంతమేర నవ్వులు పండించే ప్రయత్నం చేశాడు. పృథ్వీ కూడా అక్కడక్కడా నవ్వించాడు. కానీ వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చే క్రానిక్ హీలింగ్ కామెడీ అందరికీ రుచించే అవకాశాల్లేవు. ఈ సీన్లలో ‘ఈ రోజుల్లో’.. ‘బస్ స్టాప్’ రోజుల నాటి మారుతి గుర్తుకొస్తాడు. సినిమాలో అక్కినేని అభిమానుల్ని ఆకట్టుకునే మూమెంట్స్ కొన్ని ఉన్నాయి. అను గ్లామర్ కుర్రాళ్లను.. వెన్నెల కిషోర్-పృథ్వీల కామెడీ మాస్ ను కొంతమేర ఆకట్టుకోవచ్చు. ఐతే కథలో కొత్తదనం లేకపోవడం.. ప్రధాన పాత్రలు పేలకపోవడం.. మారుతి మార్కు ఎంటర్టైన్మెంట్ కూడా తగినంత స్థాయిలో లేకపోవడంతో ‘శైలజారెడ్డి అల్లుడు’ ఒక సగటు సినిమాలాగే అనిపిస్తుంది.

నటీనటులు:

నాగచైతన్యకు ఇదేమంత గుర్తుంచుకోదగ్గ సినిమా కాదు. ఇది అసలు హీరో కథ కాదు. రమ్యకృష్ణ.. అనుల చుట్టూనే కథంతా నడుస్తుంది. ఇలాంటి పాత్రను చైతూ ఒప్పుకోవడం విశేషమే. ఐతే చైతూ గత సినిమాలన్నింటికంటే ఇందులో అందంగా.. స్టైలిష్ గా కనిపించాడు. అతడిలోని కామెడీ యాంగిల్ ఈ సినిమాలో చూడొచ్చు. సినిమా అంతటా చైతూ ఈజ్ తో నటించాడు. రమ్యకృష్ణ బాగానే చేసింది. రమ్య పాత్ర ఆశించిన స్థాయిలో లేకపోయినా.. సినిమాకు అతి పెద్ద బలం ఆమే. ఐతే రమ్యకృష్ణపై శివగామి ప్రభావం ఇంకా పోయినట్లు లేదు. కొన్నిచోట్ల ఆ పాత్రను చూస్తున్నట్లే అనిపిస్తుంది. అను ఇమ్మాన్యుయెల్ పర్వాలేదు. ఆమె ఫిజిక్ కొంచెం తేడా కొట్టినట్లు అనిపిస్తుంది. వెన్నెల కిషోర్ సినిమా అంతటా కనిపించే రోల్ చేశాడు కానీ.. కామెడీ అతడి స్థాయికి తగ్గ స్థాయిలో లేదు. పృథ్వీ కొన్ని చోట్ల నవ్వించాడు. నరేష్ ఓకే. మురళీ శర్మ గురించి చెప్పడానికేమీ లేదు. ఆయన పాత్ర విసుగెత్తిస్తుంది.

సాంకేతికవర్గం:

గోపీసుందర్ సంగీతం పర్వాలేదు. ఎగిరెగిరే పాట ప్రత్యేకంగా అనిపిస్తుంది. ఇంకో రెండు పాటలు ఓకే. పాటల చిత్రీకరణ బాగుంది. నేపథ్య సంగీతం బాగానే ఉంది. నిజార్ షఫి ఛాయాగ్రహణం సినిమాలో చెప్పుకోదగ్గ ఆకర్షణల్లో ఒకటి. ప్రతి ఫ్రేమ్ కలర్ఫుల్ గా కనిపిస్తుంది. నిర్మాణ విలువలకు ఢోకా లేదు. ప్రతి సన్నివేశంలోనూ రిచ్ నెస్ కనిపిస్తుంది. ఇక రచయిత.. దర్శకుడు మారుతి తన ప్రధాన బలమైన వినోదం పండించడంలో అంచనాల్ని అందుకోలేకపోయాడు. కథ.. కథనం రెండింట్లోనూ కొత్తదనం చూపించలేకపోయాడు. రచయితగా.. దర్శకుడిగా అతడి ముద్ర కనిపించలేదు ఇందులో.

చివరగా: శైలజారెడ్డి అల్లుడు.. బోర్ కొట్టించేశాడు

రేటింగ్-2.5/5

కేరాఫ్ కంచరపాలెం

కేరాఫ్ కంచరపాలెం

చిత్రం: ‘కేరాఫ్ కంచరపాలెం’

నటీనటులు: సుబ్బారావు – రాధ బెస్సీ – కేశవ కర్రి – నిత్య శ్రీ గోరు – కార్తీక్ రత్నం – పరుచూరి విజయ ప్రవీణ – మోహన్ భగత్ – ప్రణీత పట్నాయక్
సంగీతం: స్వీకర్ అగస్తి
ఛాయాగ్రహణం: వరుణ్ షాఫేకర్
నిర్మాత: పరుచూరి విజయ ప్రవీణ
రచన – దర్శకత్వం: వెంకటేష్ మహా

కేరాఫ్ కంచరపాలెం.. కొన్ని రోజులుగా టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారిన చిత్రం. వెంకటేష్ మహా అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమా చూసి సినీ ప్రముఖులు వేనోళ్ల పొగిడారు. దీని ప్రోమోలు కూడా ఆసక్తి రేకెత్తించాయి. మంచి అంచనాల మధ్య ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘కేరాఫ్ కంచరపాలెం’. మరి ఈ అంచనాల్ని ఆ చిత్రం ఏమేరకు అందుకుందో చూద్దాం పదండి.

కథ:

50 ఏళ్ల వయసొచ్చినా పెళ్లి కాని ఒక అటెండర్.. అతను ఇష్టపడే ఒక పై అధికారి.. ఓ పదేళ్ల పిల్లాడు.. అతణ్ని ఆకర్షించే ఓ అమ్మాయి.. మద్యం దుకాణంలో పని చేసే ఓ కుర్రాడు.. అతను ప్రేమించే ఒక వేశ్య.. ఓ క్రిస్టియన్ కుర్రాడు.. అతడిని ఇష్టపడే ఓ బ్రాహ్మణ అమ్మాయి.. కంచరపాలెం అనే ఊళ్లో ఉండే వీళ్లందరి మధ్య సాగే కథే ‘కేరాఫ్ కంచరపాలెం’. వీరి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వాటి వల్ల వీరి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి అన్నది మిగతా కథ.

కథనం – విశ్లేషణ:

సినిమాలు వస్తుంటాయి. వెళ్తుంటాయి. కానీ చూశాక కొన్ని రోజుల పాటు వెంటాడే.. మనసులో నిలిచిపోయే సినిమాలు మాత్రం అరుదుగానే వస్తుంటాయి. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఆ కోవలోని చిత్రమే. ఈ చిత్రాన్ని విడుదల చేసిన సురేష్ బాబు అన్నట్లుగా ఇదొక నిజాయితీతో కూడిన ప్రయత్నం. స్వచ్ఛమైన సినిమా అనే మాటకు ఇది సరైన ఉదాహరణ. మన చుట్టూ ఉన్న మనుషుల్నే తెరమీద చూస్తున్నట్లు.. వాళ్ల జీవితాల్ని పక్కనుండి గమనిస్తున్నట్లు.. వాళ్లతో కలిసి మనం కూడా సాగుతున్నట్లు అనిపిస్తుంది ‘కేరాఫ్ కంచరపాలెం’ చూస్తుంటే. కాబట్టే తెరపై పాత్రలు బాధపడుతుంటే మనమూ బాధపడతాం. అవి తమషా చేస్తే నవ్వుకుంటాం. ఆ పాత్రల తాలూకు ఉత్కంఠను అనుభవిస్తాం. అన్ని రకాల భావోద్వేగాలనూ ఫీలవుతాం. ఇలా పాత్రలతో పాటుగా ప్రయాణించడం అన్ని సినిమాల్లోనూ జరగదు. కాబట్టే ‘కేరాఫ్ కంచరపాలెం’ ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుంది.

చిన్నా పెద్దా అని తేడా లేకుండా ప్రతి పాత్రలోనూ జీవం ఉండటం.. ప్రేక్షకులు ఈజీగా రిలేట్ చేసుకోవడం ‘కేరాఫ్ కంచరపాలెం’లోని అతి పెద్ద విశేషం. ఆయా పాత్రల తాలూకు అర్థవంతమైన కథలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ఇందులో ప్రధానంగా నాలుగు ఉపకథలు చూపించారు. ఇలాంటి సందర్భాల్లో ఒకట్రెండు కథలు.. కొన్ని పాత్రల వరకు బాగుంటాయి. ప్రత్యేకత చాటుకుంటాయి. మిగతా వాటిని తేల్చేస్తుంటారు. కానీ ‘కేరాఫ్ కంచరపాలెం’లో అలా జరగలేదు. ఇందులో ఏ కథకు ఆ కథ ప్రత్యేకంగా అనిపిస్తుంది. పాత్రలన్నీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఇద్దరు నడివయస్కుల ప్రేమకథను ఎంతో పరిణతితో డీల్ చేసిన విధానం మెప్పిస్తుంది. 50 ఏళ్ల వయససొస్తున్నా పెళ్లికాని రాజు పాత్రను మలిచిన విధానం అలరిస్తుంది. సినిమాలో ఈ పాత్ర ద్వారా పండించిన వినోదం హైలైట్ గా నిలుస్తుంది. ఈ పాత్ర స్థాయిలో మిగతా వినోదాత్మకంగా ఉండవు కానీ.. మిగతా పాత్రలు.. వాటి కథలు కూడా ఆసక్తి రేకెత్తిస్తాయి. పాత్రలతో ఈజీగా కనెక్టవడం వల్ల సినిమాలో త్వరగా ఇన్వాల్వ్ అయిపోతాం. వాళ్ల జీవితాల్లో తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠకు లోనవుతాం.

సినిమాలో ప్రతి పాత్రకూ ఒక నిర్దిష్టమైన వ్యక్తిత్వం ఉంటుంది. వాళ్ల ప్రవర్తన.. మాటల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి పాత్రకు ఒక బ్యాక్ స్టోరీ రాసి… దానికి తగ్గట్లే ఆయా పాత్రలు ప్రవర్తించేలా దర్శకుడు శ్రద్ధ వహిస్తే.. నటీనటులు కూడా ఆ పాత్రల్ని ఆకళింపు చేసుకుని నటిస్తే.. తెరమీద నటుల్ని కాకుండా నిజంగా వ్యక్తుల్నే చూస్తున్న భావన కలుగుతుందనడానికి ‘కంచరపాలెం’లో చాలా ఉదాహరణలు కనిపిస్తాయి. నిజంగా కంచరపాలెం అనే ఊళ్లో.. అక్కడి వ్యక్తుల్నే నటులుగా పెట్టి సినిమా తీయడం వల్ల దీనికి మరింత సహజత్వం వచ్చింది.ఇందులోని పాత్రలు.. దీని నడత అదీ చూస్తే ఇదో ఆర్ట్ సినిమాలా కనిపిస్తుంది కానీ.. లవ్.. కామెడీ.. యాక్షన్.. థ్రిల్.. ఇలా ఒక ‘కమర్షియల్’ సినిమాకు కావాల్సిన అంశాలన్నీ ఉన్నాయిందులో. కుల వ్యవస్థ.. పరువు హత్యలు వంటి అంశాలపై అర్థవంతమైన చర్చ జరిగింది ఇందులో. ఒక మనిషి జీవితంలోని వేర్వేరు దశల్ని సూచించేలా ఇందులో వేర్వేరు వయసులకు చెందిన వ్యక్తుల ప్రేమకథలు కనపిస్తాయి కంచరపాలెంలో. పదేళ్ల పిల్లాడితో పాటు 50 ఏళ్ల మధ్య వయస్కుడి ప్రేమకథను కూడా చూపించడం ద్వారా ప్రేమకు వయసుతో సంబంధం లేదని.. మనిషి జీవితంలో ప్రేమ అనేది అతి ముఖ్యమైన అంశమని దర్శకుడు చాటిచెప్పాడు. ప్రతి ప్రేమకథలోనూ ‘ఆర్ట్’ అన్నది ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఆ రకంగా దర్శకుడు తన అభిరుచిని చాటుకున్నాడు.

అందరూ కొత్త వాళ్లు నటించడం ఆరంభంలో అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. మొదట్లో సన్నివేశాలు కూడా కొంచెం నెమ్మదిగా సాగుతాయి. కానీ పాత్రలతో కనెక్షన్ ఏర్పడ్డాక సినిమా ఇక ఆగదు. చివరి వరకు అలా కూర్చోబెట్టేస్తుంది. ప్రథమార్ధం చాలా వరకు వినోదాత్మకంగా సాగిపోతుంది. ద్వితీయార్ధం ఎమోషనల్ గా నడుస్తుంది. సినిమాలో ఎన్నదగ్గ సన్నివేశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ బలమైన ముద్ర వేస్తుంది. ప్రేక్షకులు ఒక ప్రత్యేకమైన అనుభూతితో థియేటర్ల నుంచి బయటికి వస్తారు. కళాత్మక సినిమాలంటే ప్రేక్షకులు చూడ్డానికి అర్హం కానిదన్న ఒక అభిప్రాయం బలపడిపోయింది. ఐతే ‘కేరాఫ్ కంచరపాలెం’ కళాత్మకంగా సాగుతూనే.. వినోదం పంచడం.. సగటు ప్రేక్షకులకు నచ్చేలా ఉండటం విశేషం. కమర్షియల్ గా ఏ స్థాయి విజయాన్నందుకుంటుందన్నది పక్కన పెడితే… కొన్నేళ్లుగా సరికొత్తగా సాగిపోతున్న తెలుగు సినిమా ప్రస్థానంలో ఇదొక మంచి మలుపు అనడంలో సందేహం లేదు.

నటీనటులు:

‘కేరాఫ్ కంచరపాలెం’లో ఏ ఒక్కరి గురించో ప్రత్యేకంగా చెప్పి ఆపేయలేం. కంచరపాలెం ఊరికి చెందిన వాళ్లే ఇందులో నటించారు. నిజానికి వాళ్లెవ్వరూ నటించినట్లుగా అనిపించదు. అంత సహజంగా తమ పాత్రల్ని పండించారు. అందరిలోకి రాజు పాత్ర చేసిన వ్యక్తి నటన హైలైట్ గా నిలుస్తుంది. చిన్న పిల్లలు సైతం అబ్బుర పరిచే నటనతో కట్టి పడేశారు. నిర్మాత విజయ ప్రవీణ వేశ్య పాత్రలో గొప్పగా నటించింది. తక్కువ నిడివి ఉన్న చిన్న చిన్న పాత్రల్లో నటించిన వాళ్లు సైతం తమదైన ముద్ర వేశారు.

సాంకేతికవర్గం:

టెక్నికల్ గానూ ‘కేరాఫ్ కంచరపాలెం’ ఉన్నతంగా అనిపిస్తుంది. సాంకేతిక నిపుణులందరూ దర్శకుడి ఆలోచనలకు.. అభిరుచికి తగ్గట్లుగా పని చేశారు. స్వీకర్ అగస్తి పాటలు.. నేపథ్య సంగీతం సినిమాకు తగ్గట్లే చాలా స్వచ్ఛంగా అనిపిస్తాయి. సింక్ సౌండ్ లో చేయడం వల్ల సినిమాకు వైవిధ్యం చేకూరింది. వరుణ్ షాఫేకర్ ఛాయాగ్రహణం కూడా సినిమాకు బలంగా నిలిచింది. దర్శకుడు.. కెమెరామన్ కలిసి కంచరపాలెం నేటివిటీని చాలా అందంగా చూపించారు. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లుగా ఉన్నాయి. నిర్మాత విజయ ప్రవీణ అభిరుచికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఈ చిత్రానికి అండగా నిలిచిన రానా దగ్గుబాటిని కూడా అభినందించాలి. ఇక దర్శకుడు వెంకటేష్ మహా తొలి సినిమాతోనే బలమైన ముద్ర వేశాడు. రచయితగా.. దర్శకుడిగా అతడి ప్రతిభ ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. అతను పాత్రల్ని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. స్క్రీన్ ప్లే.. నరేషన్ చాలా కొత్తగా అనిపిస్తాయి. ఒక కొత్త దర్శకుడు ఇలాంటి సాహసం చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం.

చివరగా: స్వచ్ఛమైన సినిమా.. కేరాఫ్ కంచరపాలెం

రేటింగ్-3.25

సిల్లీ ఫెలోస్

సిల్లీ ఫెలోస్

 

చిత్రం : ‘సిల్లీ ఫెలోస్’

నటీనటులు: అల్లరి నరేష్ – సునీల్ – చిత్ర శుక్లా – నందిని – జయప్రకాష్ రెడ్డి – పోసాని కృష్ణమురళి – రాజా రవీంద్ర  – ఝాన్సీ తదితరులు
సంగీతం: శ్రీ వసంత్
ఛాయాగ్రహణం: అనీష్ తరుణ్ కుమార్
నిర్మాతలు: భరత్ చౌదరి – కిరణ్ రెడ్డి  – వివేక్ కూచిభొట్ల
స్క్రీన్ ప్లే – దర్శకత్వం: భీమనేని శ్రీనివాసరావు

కామెడీ హీరోలు అల్లరి నరేష్.. సునీల్ ఒకప్పుడు మంచి విజయాలందుకున్నారు. కానీ గత కొన్నేళ్లలో వారిని వరుస పరాజయాలు కుదేలు చేశారు. ఇప్పుడు వీళ్లిద్దరూ కలిసి హిట్టు కోసం చేసిన ప్రయత్నం.. సిల్లీ ఫెలోస్. రీమేక్ చిత్రాల స్పెషలిస్టు భీమనేని శ్రీనివాసరావు తమిళంలో విజయవంతమైన ఓ చిత్రం ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

వీరబాబు (అల్లరి నరేష్) ఒక టైలరింగ్ షాపు నడుపుతుంటాడు. అతను ఆ ఊరి ఎమ్మెల్యేకు తలలో నాలుకలా ఉంటాడు. ఐతే వీరబాబు చేసిన ఒక తప్పు వల్ల అతడి స్నేహితుడైన సూరి (సునీల్) సమస్యలో ఇరుక్కుంటాడు. మరోవైపు తాను ప్రేమించిన అమ్మాయికి సాయపడే క్రమంలో వీరబాబు కూడా ఇబ్బందుల్లో పడతాడు. అతడిని సమస్యల నుంచి బయట పడేయాల్సిన ఎమ్మెల్యే మతిస్థిమితం కోల్పోతాడు. దీంతో వీరబాబు.. సూరి దిక్కు తోచని స్థితిలో పడతారు. మరి వీళ్లు తమ సమస్యల నుంచి బయట పడటానికి ఏం చేశారన్నది మిగతా కథ.

కథనం – విశ్లేషణ:

ఇంతకుముందు తెలుగులో కన్ఫ్యూజింగ్ కామెడీలు తెగ ఆడేస్తుండేవి. స్పూఫులు.. పేరడీలు బాగా వర్కువటయ్యేవి. అప్పట్లో కామెడీ కూడా చాలా లౌడ్ గా.. గోల గోలగా ఉండేది. కానీ గత కొన్నేళ్లలో తెలుగు సినిమాల తీరు మారింది. ప్రేక్షకుల అభిరుచి కూడా మారిపోయింది. ఇప్పుడంతా సిచువేషనల్ కామెడీని.. సటిల్ గా సాగిపోయే వినోదాన్ని ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. కానీ ఇలాంటి తరుణంలో భీమనేని అండ్ కో ‘సిల్లీ ఫెలోస్’తో తెలుగు ప్రేక్షకుల్ని పదేళ్లు వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. చెప్పుకోదగ్గ కథాకథనాలేమీ లేకుండా కేవలం లౌడ్ కామెడీని నమ్ముకుని లాగించేసిన సినిమా ఇది. తమిళంలో విజయవంతమైన ‘వేలయను వంద వేలైక్కారన్’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో కథ ఒక తీరుగా ఉండదు. సన్నివేశానికి సన్నివేశానికి లింకుండదు. అసలెక్కడా లాజిక్ అనే మాటే కనిపించదు. కామెడీ వర్కవుటైతే ఏవి ఎలా ఉన్నా చెల్లిపోయేది. కానీ ఔట్ డేటెడ్ అయిపోయిన కామెడీ సీన్లు చాలా వరకు నవ్వుల పాలే అయ్యాయి తప్ప ప్రేక్షకులకు నవ్వు తెప్పించలేకపోయాయి. సినిమాలో ప్రతి సీన్ కూడా సిల్లీగానే అనిపిస్తుంది. అందుకే దీనికి ‘సిల్లీ ఫెలోస్’ అనే టైటిల్ పెట్టారేమో అనిపిస్తుంది.

‘సిల్లీ ఫెలోస్’ చూస్తున్నంతసేపూ అసలేముందని ఈ సినిమాను తమిళం నుంచి తెలుగులోకి తీసుకొచ్చారు అన్న సందేహం కలుగుతుంది. ఎంత కామెడీ సినిమా అయినప్పటికీ తమిళ జనాలు ఇంతటి సిల్లీ కథతో సినిమా తీశారంటే ఆశ్చర్యం కలుగుతుంది. నిజానికి తమిళంలో ఈ చిత్రం విజయవంతం కావడానికి ప్రధాన కారణం.. కమెడియన్ సూరి చేసిన పాత్రే. ఆ క్యారెక్టర్ ఆద్యంతం వినోదం పంచుతుంది. సూరి తనదైన కామెడీ టైమింగ్ తో సినిమాను నిలబెట్టాడు. కానీ తెలుగులోకి వచ్చేసరికి ఆ పాత్ర పేలవంగా తయారైంది. ఆ క్యారెక్టర్ చేసిన సునీల్.. ఒక్కటంటే ఒక్క సీన్లోనూ నవ్వించలేకపోయాడు. కామెడీ వేషాలు మానేసి చాలా ఏళ్ల పాటు హీరోగా కంటిన్యూ అయిపోవడంతో.. సునీల్ కామెడీ టైమింగ్ పూర్తిగా మిస్సయిపోయిన భావన కలుగుతుంది. కమెడియన్ గా ఒకప్పుడు అతడి ప్రతి ఎక్స్ ప్రెషన్.. ప్రతి డైలాగ్ నవ్వించేది. కానీ ‘సిల్లీ ఫెలోస్’లో సునీల్ ఏం చేసినా నవ్వించలేకపోయాడు. తమిళంలో సూరి వల్ల  హిలేరియస్ గా పండిన సన్నివేశాలే.. ఇక్కడ సునీల్ చేస్తుంటే అసలేమాత్రం నవ్వు రాకపోవడం సినిమాకు పెద్ద ప్రతికూలతగా మారింది. ఒరిజినల్లో ప్రధాన బలమైన క్యారెక్టరే ఇక్కడ తేలిపోవడంతో ‘సిల్లీ ఫెలోస్’ బలహీనంగా తయారైంది.

సునీల్ పాత్రను పక్కన పెట్టి చూసినా.. ‘సిల్లీ ఫెలోస్’లో చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు. ముందే చెప్పినట్లు ఇందులో చెప్పుకోదగ్గ కథ లేదు. కథనమూ అంతంతమాత్రమే. లాజిక్ తో పని లేకుండా ఎలా పడితే అలా సినిమా సాగిపోతూ ఉంటుంది. సినిమా నిండా బోలెడన్ని కామెడీ క్యారెక్టర్లున్నా వినోదం పండలేదు. నరేష్ సైతం ఏమీ చేయలేకపోయాడు. అతడి పాత్రలోనూ ఏ విశేషం లేదు. ఉన్నంతలో జయప్రకాష్ రెడ్డి.. పోసాని కృష్ణమురళి కొంత మేర నవ్వించే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ల కామెడీ కూడా చాలా పాతగా అనిపిస్తుంది. మాస్ ప్రేక్షకులు కొంతమేర ఆ కామెడీతో కనెక్ట్ కావచ్చేమో. ఒక సీన్లో అల్లరి నరేష్.. ‘‘నేను నిప్పు లాంటి మనిషిని. కావాలంటే గూగుల్ చేసి చూస్కో’’ అంటాడు. మరో సీన్లో మత్తు స్ప్రే కొట్టరా అని విలన్ అంటే అతడి అసిస్టెంట్.. బాడీ స్ప్రే కొడతాడు. ఇంకో విలన్ని ఇన్ డీసెంట్ ఫెలో అని తిడితే.. వీడేంటి నన్ను ‘ఇంటిలిజెంట్ ఫెలో’ అంటున్నాడు అంటాడు. ఇలాంటి డైలాగులు.. సీన్లతో కామెడీ పండించే రోజులు కావివి. ఇలాంటి సిల్లీ డైలాగులు.. సిల్లీ సీన్లతోనే ‘సిల్లీ ఫెలోస్’ నిండిపోయింది.

నటీనటులు:

అల్లరి నరేష్ పర్వాలేదు. ఎప్పట్లాగే తనకు అలవాటైన రీతిలో నటించాడు. కానీ అతడి పాత్రలో ఏ ప్రత్యేకతా లేదు. నరేష్ కూడా ముందులా కామెడీ పండించలేకపోయాడు. ఇక సునీల్ సంగతైతే చెప్పాల్సిన పని లేదు. అతడి కామెడీ అసలేమాత్రం వర్కవుట్ కాలేదు. హీరోయిన్ చిత్ర శుక్లా గురించి చెప్పుకోవడానికేమీ లేదు. ఆమె ఏ రకంగానూ ఆకట్టుకోలేదు. జయప్రకాష్ రెడ్డి.. పోసాని కృష్ణ మురళి కొంత మేర నవ్వించారు. మిగతా నటీనటులంతా మామూలే.

సాంకేతికవర్గం:

శ్రీ వసంత్ పాటల్లో ఒక్కటీ గుర్తుంచుకోదగ్గది లేదు. పాటలు ఇలా వచ్చి అలా వెళ్లిపోతాయి. నేపథ్య సంగీతమూ అంతంతమాత్రమే. తరుణ్ ఛాయాగ్రహణం కూడా మామూలుగా సాగిపోతుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు. భీమనేని శ్రీనివాసరావు రీమేక్ కోసం ఎంచుకున్న సినిమానే సరైంది కాదు. తెలుగు సినిమాల్లో కామెడీ తీరు పూర్తిగా మారిపోయిన విషయాన్ని ఆయన గుర్తించనట్లే ఉంది. చాలా ఏళ్ల వెనుకటి శైలిలో సినిమాను నడిపించాడు. దర్శకుడిగా ఆయనేమాత్రం మెప్పించలేకపోయారు. సినిమాలో అన్ని అంశాలూ ఔట్ డేటెడ్ అనిపిస్తాయి.

చివరగా: సిల్లీ ఫెలోస్.. సిల్లీ సినిమా!

రేటింగ్- 2.0/5