1000 సినిమాల రారాజు బ్రహ్మానందం. ఎన్నో సన్మానాలు – ఎన్నో అవార్డులు – రివార్డులు – గొప్ప గుర్తింపు.. ప్రపంచంలోనే ఇలాంటి వేరొక కమెడియన్ లేడు అంటే అతిశయోక్తి కాదు. అసలు ఫేడవుట్ అన్న మాటే లేని గొప్ప కమెడియన్ ప్రపంచ చరిత్రలో ఎవరైనా ఉన్నారా? అంటే అది ఒక్క బ్రహ్మానందం మాత్రమే. అయితే గత కొంతకాలంగా అతడి కెరీర్ నెమ్మదించిన మాట వాస్తవం. బ్రహ్మీ యాటిట్యూడ్ వల్లనే ఇండస్ట్రీ దూరం పెట్టిందంటూ ఇదివరకూ ఓ ప్రముఖ వార్తా చానెల్ చేసిన ప్రచారంతో బ్రహ్మీ చాలానే ఇబ్బంది పడ్డారు. ఓ రకంగా అంత సీనియర్ హాస్యనటుడిని అవమానిస్తూ సదరు చానెల్ కథనాలు ప్రచారం చేయడం ఇండస్ట్రీ యావత్తూ చర్చకొచ్చింది. ఆ కథనాలు వన్ సైడెడ్! అన్న విమర్శలు వెల్లువెత్తాయి.

అసలు బ్రహ్మానందానికి యాటిట్యూడ్ నిజమేనా? అందుకే అవకాశాలు రాలేదా? ఇదే ప్రశ్న ఆయన్నే అడిగేస్తే ఏం చెబుతారో తెలుసా?  దిమ్మతిరిగిపోయే ఆన్సర్ అట్నుంచి బౌన్స్ బ్యాక్ అవుతుంది. అసలు బ్రహ్మానందం ప్రతిభకు అవకాశాలు ఇవ్వనిది ఎవరు? అతడికి ఈరోజు కొత్తగా ఇండస్ట్రీలో పరిచయాలు కావాలా? అయితే ఆయన గత కొంతకాలంగా కేవలం అతి కొద్ది సినిమాలకు మాత్రమే కమిటవుతూ చాలావాటిని దూరం పెడుతున్నారు. దానికి ప్రత్యేకించి కారణం లేకపోలేదు. కెరీర్లో వెయ్యి సినిమాలు చేశాక ఇంకా ఇంకా అవే పాత చింతకాయ క్యారెక్టర్లతో తనని దర్శకులు సంప్రదిస్తే బోర్ కొట్టదా? ఒకే తరహా పాత్రలు చేయడం బ్రహ్మీ మళ్లీ అదే కామెడీ ఏంటో అని చీదరింపులు భరించడం ఎందుకు? అనేస్తారు సింపుల్ గా. ఇంత సాధించాక ఇంకా డబ్బు కోసం అంగీకరించలేనని – ప్రస్తుతం నా సన్నివేశం అదేనయ్యా అని బ్రహ్మీ ఇదివరకూ ఓ ఇంటర్వ్యూలోనూ చెప్పారు.

పాచిపోయిన పచ్చళ్లు తెచ్చినట్టు ఇవేం క్యారెక్టర్లు అనే భావన ఆయనలో పాదుకుపోయింది. అందుకే చాలామంది యువదర్శకులు ప్రయత్నించినా దూరం పెట్టేశారు. అసలు బ్రహ్మానందంలో  పస అయిపోలేదన్నది ఆయన్ని చూసి చెప్పొచ్చు. అతడు ఇలా కనిపించి అలా ఓ ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలు. పగలబడి నవ్వకుండా ఉండలేం. నాసిరకం పాత్రల్ని ఎంచుకుని చేసేకంటే… బుల్లితెరకు ప్రాధాన్యతనిస్తూ హోస్టింగ్ చేయడంపైనే బ్రహ్మీ దృష్టి సారిస్తున్నారు. తనని అనేవాళ్లు ఎందరు వున్నా రాజు రాజే. రత్నం రత్నమే. టాలీవుడ్ కమెడియన్లలో మేలిమి రత్నం బ్రహ్మానందం అనడంలో సందేహం లేదు.