రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకున్న పరువు హత్య గురించి తెలిసిందే. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి కన్నతండ్రే తన భర్తను కిరాతకంగా చంపించిన వైనంతో తల్లడిల్లిపోయి తీవ్ర షాక్ కు గురైన అమృత తాజాగా మీడియాతో మాట్లాడింది.

తనను పరామర్శించేందుకు వచ్చిన వారితో.. అంకుల్.. ప్రణయ్ ను నాన్నే చంపించాడంటూ ఆమె రోదనలు అక్కడి వారిని కదిలించి వేస్తున్నాయ్. ప్రణయ్ ను తన తండ్రే చంపించి ఉంటారని.. ఆయన ఆలోచనల గురించి తన తల్లి ఎప్పటికప్పుడు చెప్పేదని పేర్కొంది. ప్రణయ్ ను చంపేందుకు చాలాసార్లు రెక్కీ నిర్వహించినట్లుగా వాపోయింది.

తాను.. ప్రణయ్ నవ్వుకుంటూ వెళుతున్న వేళ పక్క నుంచి ఎవరో గట్టిగా కొట్టారని.. వెంటనే ప్రణయ్ కిందకు పడిపోయాడని.. అనంతరం దాడి చేసి చంపేశారని భోరుమంది. దాడి చేసిన వారిని తాను స్పష్టంగా చూడలేదంది. తన కదలికల్ని తన తండ్రి ఎప్పటికప్పుడు తెలుసుకునే వారని.. తమపై తన తండ్రి నిఘా ఉంచారన్నారు.

గోల్డ్ షాపులో ఉన్నావ్.. బ్యూటీప్లారర్ లో ఉన్నావంటూ తన తల్లి తనకు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్పేదని.. తన తండ్రికి ఎవరో ఫోన్ చేసిన తన కదలికల్ని చెప్పేవారని తన తల్లి తనతో చెప్పినట్లుగా పేర్కొంది.

ప్రస్తుతం తాను ఐదు నెలల గర్బిణినని.. ఆ విషయం అమ్మకు చెప్పానని.. అప్పటి నుంచి తన తల్లి తన గురించి ఎప్పటికప్పుడు ఫోన్ చేసి యోగక్షేమాల గురించి అడిగేదని అమృత చెప్పింది. తాను గర్బవతి అన్న విషయం తెలిసిన తన తండ్రి మాత్రం తన గర్బాన్ని తీయించుకోవాలని ఒత్తిడి చేసేవారన్నారు. ప్రణయ్ చనిపోయిన వెంటనే జరిగిన ఘటన గురించి తన తండ్రికి ఫోన్ చేశానని.. ఎవరో దాడి చేసి ప్రణయ్ ను చంపేశారని చెబితే.. సరిగా వినిపించటం లేదని ఫోన్ పెట్టేశారని చెప్పారు. తనపైనా దాడి జరిగిందని చెబితే పట్టించుకోలేదని.. ఆసుపత్రికి వెళ్లాలని చెప్పినట్లుగా పేర్కొంది.

తర్వాత తాను ప్రణయ్ తండ్రికి ఫోన్ చేశానని.. ప్రణయ్ ను చంపేస్తే తాను వెనక్కి వస్తాననే ఇలా చేశారని.. అయితే తన తండ్రి వద్దకు వెళ్లేది లేదని అమృత చెప్పింది. ప్రణయ్ చాలా మంచివాడని.. దారుణంగా చంపేశారంటూ కన్నీటి పర్యంతమైంది. తన కళ్ల ముందే ప్రణయ్ ను చంపిన వైనాన్ని చెబుతూ.. అలాంటి పరిస్థితుల్లో ప్రణయ్ ను చూస్తానని తాను ఎప్పుడూ అనుకోలేదని వాపోయింది.

తనను ప్రణయ్ వద్దకు తీసుకెళ్లాలని తనను పరామర్శించటానికి వచ్చిన వారిని అమృత వేడుకొంది. అంకుల్ ప్లీజ్.. ప్రణయ్ ను చూడకపోతే ఎట్లా?  ప్లీజ్ నన్ను విడిచిపెట్టండి? ప్రణయ్ ను నాకు దక్కకుండా చేసిన వాళ్లని చంపేయండి అంకుల్ అంటూ వేదనను వ్యక్తం చేసింది. గర్బిణి కావటంతో ఆమె రెస్ట్ తీసుకోవాలంటూ వైద్యులు అమృతకు సూచిస్తున్నారు. ఆమె ఆవేదన అందరి కంటతడి పెట్టిస్తోంది.